అంతా అయోమయం జగన్నాథం

ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది అంటే... పక్కాగా ఇది జరుగుతోంది అని క్లియర్ కట్‌గా చెప్పగలిగే వారు.. అటు ప్రభుత్వంలో కానీ.. ఇటు ప్రజల్లో కానీ మరోవైపు అధికార పార్టీ నాయకుల్లో కానీ లేరన్నది సుస్పష్టం. జగన్ అధికారంలోకి రావడంతోనే.. మూడు రాజధానులు అన్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి అన్నారు.. అయితే ఈ రెండిటి వ్యవహారం ఈ రెండున్నరేళ్లలో ఎంత వరకు వచ్చిందంటే మాత్రం ఆలోచించాల్సిందే. 

కృష్ణానది కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు అన్నారు. మళ్లీ దానీ ఊసే లేదు. అంతదాకా ఎందుకు పీఆర్సీ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. మరోవైపు రాష్ట్ర ఖజానా నిండుకొంది. దీంతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. నిధుల వేటలో ఢిల్లీ టు అమరావతి.. అమరావతి టు ఢిల్లీ అన్న చందంగా కాలుకు బలపం కట్టుకుని మరీ అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకో వైపు గతంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు సైతం ఓటీఎస్ పేరుతో ఈ జగన్ ప్రభుత్వం నిధులు దండుకోంటుందీ. ఇలా ఒకటి అని లేకుండా.. పలు అంశాలను తెరపైకీ తీసుకు వచ్చి.. వాటికి సైతం పన్నులు వసూల్ చేయడం ఈ జగన్ సర్కారకు రివాజుగా మారిందనే విమర్శలు అయితే వెల్లువెత్తాయి. ఇక సినిమా టికెట్ల ధరల విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. 


తాజాగా జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను తెరపైకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు 13 జిల్లాలు ఉండగా.. ఆ స్థానంలో 26 జిల్లాలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే జిల్లాకో విమానాశ్రయం నిర్మించాలని జగన్ ప్రభుత్వం  భావిస్తూంది. అంటే 13 జిల్లాలకు 13 విమానాశ్రయాలు వస్తాయని భావిస్తున్న తరుణంలో.. రాష్ట్రంలో మరో 13 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిందీ. దీంతో రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు కానున్నాయి. మరీ ఈ 26 జిల్లాలకు విమానాశ్రయాలను జగన్ ప్రభుత్వం నిర్మిస్తుందా? అంటూ ప్రజలకు సందేహం వస్తుందీ. రాష్ట్రంలో రహదారులు పరిస్థితి పూర్తి అధ్వానంగా ఉన్నాయి. ప్రయాణికులు.. ఈ రహదారులపై ప్రయాణం చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రహదారులు బాగు చేస్తే చాలునని సామాన్య మానవుడు గంపెడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. 

రాష్ట్రంలో నిధులు కొరత తీవ్రంగా ఉంది. అలాంటి సమయంలో విమానాశ్రయాలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా వేళ.. ఏ సమస్య వచ్చినా.. ఎలాంటి సమస్య వచ్చినా.. ప్రభుత్వంలో ఎవరిని కలవాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలతో సామాన్యుడు తీవ్ర సతమతమవుతోన్నాడు. అయినా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. పరిస్థితి ఏమిటీ అంటే.. అంతా అయోమయం జగన్నాథం.. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అంతా ఇదే మాట.