మళ్ళీ మరోసారి కేద్రానికి జగన్.. జీ హుజూర్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ... ఎవరి మాటా వినరు. ఆయన సీతయ్య, అంటారు. ఆయనకు భయం అంటే ఏమిటో తెలియదని కూడా కొందరి ఉవాచ. స్వయంగా జగన్ రెడ్డి కూడా ఏదో సందర్భంలో, దేనికైనా గుండె ధైర్యం ఉండాలి, అంటూ రొమ్మువిరిచి గుండెలు చూపారు. 
అయితే, అదంతా నిజమేనా అంటే, కాదు అనే వాళ్ళున్నారు. ఆయన చాలా విషయాలకు భయపడతారు. నిజానికి భయం ఆయన్ని నీడల వెంటాడుతుంది. అందుకే, ఆయన ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే, ఇద్గో ఇలాంటి  బింకపు ప్రకటనలు చేస్తుంటారని అంటారు.  నిజానికి కేంద్రం పేరెత్తితే, ఆయన వణికి పోతారు. అందుకే  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని, జగన్ రెడ్డి వ్యతిరేకించలేదని అంటారు. అది నిజం కూడా, ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే, ఢిల్లీ వెళ్లి, ప్రధాని నరేద్ర మోడీని కలిసి, ఏపీ ప్రజల ప్రధాన ఆకాంక్ష, ‘ప్రత్యేక హోదా’ను మోడీ పాదాల దగ్గర పెట్టి, ‘శరణాగతి’ వేడి వచ్చారని అంటారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే, ఆక్రమాస్తుల కేసుల నుంచి తమను తాము రక్షించుకోవడమే ముఖ్యమనే ద్దేశంతోనే  ప్రత్యేక హోదా గురించి ప్రార్దిస్తామే కానీ, డిమాండ్ చేయమని చెప్పారు.ఆఫ్కోర్స్, అందుకు ఆయన కేంద్రంలో తాము ఆశించిన విధంగా, సంకీర్ణం రాలేదు కాబట్టి .. అంటూ సన్నాయి నొక్కులు నొక్కరు అనుకోండి అది వేరే విషయం.  
ఇక అక్కడి నుంచి ఇంతవరకు ఏ ఒక్క విషయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేయలేదు. ఆయన ప్రభుత్వమూ చేయలేదు. ఇది కళ్ళముందు కనిపిస్తున్న సత్యం. కేంద్రం ఏదంటే దానికి,  జీ హుజూర్ అంటూ తల ఊపడమే కానీ, ప్రశ్నించిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను సైతం ముఖ్యమంత్రి సమర్ధించారని అంటారు. అందు వల్లనే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలు సహా ప్రతి విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయమే చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
కాగ తాజాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివదాస్పద  సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్ సవరణ ప్రతిపాదనకూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పారని అంటున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు తమిళ నాడు, కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు బహిరంగంగా కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించాయి. ఆయినా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వాగతించారు. ఈమేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది మరో మారు, కేంద్రానికి ముఖ్యమంత్రి ఎంతగా భయపడుతున్నారో. ఎలా సరెండర్ అయ్యారో చెప్పకనే చెపుతోందని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.   
నిజానికి, సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, బీజీపీ ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల  ముఖ్యమంత్రులు కూడా మనఃస్పూర్తిగా స్వాగతించడం లేదు. బహిరంగంగా వ్యతిరేకించక పోయినా పార్టీ చానల్స్ ద్వారా తమ వ్యతిరేకతను తెలియ చేస్తున్నట్లు సమాచారం. ఇలా బీజేపీ ముఖ్యమంత్రులు సైతం వ్యతిరేకిస్తున్నప్రతిపాదనను జగన్ రెడ్డి స్వాగతించడం వెనక ఉన్నది భయం కాదా , అని ప్రశ్నిస్తున్నారు. 
ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే నిర్ణయంగా చెబుతూ ఘాటు లేఖ రాస్తే జగన్ రెడ్డి మాత్రం ఆ నిర్ణయాని స్వాగతించడం,ఎలాంటి సంకేతాలు పంపుతుందని అనటున్నారు. 
కేంద్ర నిర్ణయం అమలైతే, రాష్ట్ర కేడర్ సివిల్ సర్వీస్ అధికారుల్ని కేంద్రం ఎప్పడు కావాలంటే అప్పుడు పిలిపించుకునేందుకు తలుపులు తెరుచు కుంటాయి.  అదే జరిగితే సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయినట్లేనని అంటున్నారు.  
అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.  
తెలంగాణ, తమిళ నాడు, కేరళ సహా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలు అయితే, కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించడమే కాదు, ఉమ్మడి పోరాటానికి కూడా సిద్దమవుతున్నారు. చివరకు బీజేపీ భాగస్వామిగా ఉన్న బీహారు సంకీర్ణ ప్రభుత్వం కూడా కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించింది. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం  కేంద్రం నిర్ణయాన్నిస్వాగతించారు. అంటే, కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు, సమాఖ్య స్పూర్తికి పూర్తి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా, ‘జీ హుజూరు’ అంటూ తల ఊపడం తప్ప.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయిందని,విపక్షాలు కాదు స్వపక్షీయులే గుసగుసలు పోతున్నారు.