జగన్ సర్కార్ మరో యూ టర్న్.. గ్రామ కార్యదర్శులపై జీవో వెనక్కి

ఆంధ్రప్రదేశ్ లోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో యూ టర్న్ తీసుకుంది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీఓ నెంబరు 59ను  వెనక్కి తీసుకుంది. గురువారం జీవో నెం.59పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో  జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. జీఓను ఉపసంహరించి వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ గతంలో  ఏపీ సర్కార్ జీవో నెంబరు 59ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటీషన్లు దాఖలు చేశారు. పిటీషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. గ్రామ కార్యదర్శులకు కానిస్టేబుళ్లుగా మార్చి వారికి పోలీసు డ్రస్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ సర్కార్ న్యాయస్థానానికి వెల్లడించింది.