రావత్ కు నివాళి.. బ్లాక్ బాక్స్ లో ఏముంది.. జగన్ యూ టర్న్.. టాప్ న్యూస్@1PM

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి  పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉభయసభల్లో  ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 
---
తమిళనాడులోని కున్నూర్‌ సమీపంలో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోయిన చోట బీతావహ వాతావరణం కనిపించింది. ప్రమాదస్థలిని వాయుసేన అధికారులు పరిశీలించారు. ఘటనాస్థలి నుంచి బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌బాక్స్‌ కీలకం కానుంది. అందులో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే వీలుంది. దీన్ని డీకోడ్‌ చేసేందుకు ఢిల్లీకి తరలిస్తున్నారు అధికారులు. .
------
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో జిల్లా వాసి సాయితేజ మరణించడంతో స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోక సంద్రంలో ఉన్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి సాయి తేజ మృతదేహం గ్రామానికి చేరుకోనుంది. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అధికార యంత్రాంగం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది.
-------
గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీఓ నెంబరు 59ను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గురువారం జీవో నెం.59పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో  జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ గతంలో  ఏపీ సర్కార్ జీవో నెంబరు 59ను జారీ చేసింది. 
-------
జీజీహెచ్‌లో మూడోరోజు జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అర్బన్, జిల్లా కలెక్టర్‌లకు వినతి పత్రాలు అందజేశారు. వైద్యులపై దాడులు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. తమపై దాడి చేసిన రాజకీయ పార్టీ వ్యక్తులను అరెస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు
------
వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మించిన పెంకుటిల్లును సైతం అధికారులు ఓటీఎస్‌లో చేర్చారు. ఇది పక్కా ఇల్లా.. పెంకుటిల్లా అని చూడకుండానే వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి ఓటీఎస్‌లో భాగంగా డబ్బులు చెల్లించాలని ఆ ఇంటి కొలతలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. దీందో వృద్ధ దంపతులు కంగుతిన్నారు. 
-------
ఒక దీక్ష... ఒక విజయం.. ఒక యాది...' అంటూ 2009, డిసెంబరు 9ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌త్యేక‌ తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేస్తోన్న స‌మ‌యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం  తెలంగాణ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌త్యేక‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
----
కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో ఎంపీ ధర్మపురి అరవింద్  భేటీ అయ్యారు. బైంసా అల్లర్ల అనంతరం పార్టీ కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ పిర్యాదు చేశారు. నలుగురు కార్యకర్తలపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేశారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంఐఎం నేతల ఆదేశాల అనుగుణంగా పోలీసులు పని చేస్తున్నారని ఎంపీ తెలియజేశారు. 
--
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరుగురు సభ్యుల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం వేమనీడు త్రినాధబాబు అనే వ్యక్తిని ముఠా కిడ్నాప్ చేసింది. త్రినాధ్ బాబు తండ్రికి ఫోన్ చేసి లక్షన్నర రూపాయలను ముఠా డిమాండ్ చేసింది. ఈ కిడ్నాప్‌కు సంబంధించి వెంటనే స్పందించిన పోలీసులు ఎంతో చాకచక్యంగా ముఠాను అరెస్టు చేసి,  త్రినాధ్ బాబును విడిపించారు. 
---
ప్రకాశం జిల్లా  పెద్దారవీడు మండలం గోబ్బురు వద్ద విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్‌లో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరు స్వెటర్స్ అమ్ముకునేందుకు బైక్‌పై వెళ్తుండగా మంత్రి సురేష్ కాన్వాయ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బాడిగ మహేష్‌, క్షతగాత్రురాలు ఆయన భార్య మహేశ్వరిగా గుర్తించారు. 
-------