వాలంటీర్లపైనే విశ్వాసం.. ఎన్నికల్లో గట్టెక్కిస్తారన్నదే జగన్ ధీమా

వైఎస్ జగన్మోహనరెడ్డి...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇప్పటి పాలన సంగతి పట్టించుకోకుండా మరో రెండేళ్ల తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రస్తతం రాష్ట్రంలో అన్ని వర్గాలలో అసంతృప్తి గూడుకట్టుకుందన్న సంగతి ప్రస్ఫుటంగా తెలుస్తున్నా...రెండేళ్లలో జగన్మాయ చేయలేనా అన్న ధీమాతో ఉన్నారు. అందుకే పార్టీలో అసమ్మతినీ, ఉద్యోగులలో ఆగ్రహాన్నీ, సామాన్య జనంలో ఆవేదననీ దేనినీ అడ్రెస్ చేయడం లేదు...కనీసం చేద్దామని కూడా అనుకోవడం లేదు. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆయన ధీమా ఏమిటి?

ఇందుకు ఆయనే సృష్టించిన సరికొత్త (అ)వ్యవస్థ ఉందిగా... అదే వాలంటీర్ల వ్యవస్థ. దానిపైనే ఆయన నమ్మకం...వాలంటీర్లు ఉన్నారన్నదే ఆయన ధీమా అంటున్నారు విశ్లేషకులు. సొంత గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగమంటూ ఘనంగా ప్రకటించుకుని పెద్ద ఎత్తున నామమాత్రపు వేతనాలకు ఆయన నియమించుకున్న ప్రైవేటు సైన్యమే వాలంటీర్లు. వచ్చే ఎన్నికలను వారి ద్వారానే గట్టెక్కాలన్నది ఆయన యోచన. వైకాపా ఎమ్మెల్యేలు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో జగన్ ధీమా ఇదేనని చెప్పుకొస్తున్నారు. 
వలంటీర్లతో ఎన్నికలు గెలవడమేమిటి? ఎన్నికలలో విజయం సాధించాలంటే అభివృద్ధి పనులు చేయాలి. ప్రజా సంక్షేమం కుంటుపడకుండా కార్యక్రమాలు చేయాల. తద్వారా ప్రజా విశ్వాసం చూరగొనాలి. అప్పుడు కదా, జనం మెచ్చి ఒట్లేసేది? కానీ వైకాపా అధినేతకు అటువంటి వాటిపై నమ్మకం లేదు. ప్రజల వద్దకు నేరుగా ప్రభుత్వం అంటే వాలంటీర్లు వెళ్లి సేవలందిస్తున్నారు కదా! ఇంకేం చేయాలి? అన్న ధీమాలో ఉన్నారు. వాలంటీర్లనే బూతు స్థాయి అధికారులుగా నియమించేస్తే.. కాగల కార్యం వారే చూసుకుంటారన్న దీమా ఆయనది. అందుకే ఊరూరా, వాడ వాడలా వాలంటీర్లకు సన్మానం చేసే కార్యక్రమానికి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టారు. అది ఇంకా కొనసాగుతోంది. 

వారి మీద ఎంత విశ్వాసం అంటే స్థానిక ప్రజాప్రతినిథుల అధికారాలలో కోత పెట్ట మరీ వారికి కట్టబెట్టారు. స్థానికంగా ఎమ్మెల్యేలను మించిన పెత్తనం వారి చేతికే ఇచ్చేశారు. అధికారికంగా కాదు...  మీ అంతటి వారు లేరంటూ భుజకీర్తులు తగలించడం ద్వారా. ఇంతకీ వాళ్లు చేయాల్సిన పనేమిటి? వైకాపా కార్యకర్తల్లా పని చేయాలి. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు మోయాలి.
అయితే స్థానిక ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల మితిమీరిన జోక్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక దశలో వాలంటీర్ల జోక్యాన్ని అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. వారి ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. తరువాత బద్వేలు, తిరుపతి ఎన్నికలలో కూడా వారి తీరు, శైలి వివాదాస్పదం అయ్యింది. 
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పబ్బం గడిచేతి వారి చలువతోనే అని జగన్ నమ్మతున్న నేపధ్యంలో గతంలో వారి ప్రమేయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం ఈ సారి ఊరుకుంటుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.