కన్నీరు పెట్టుకున్న జగన్!
posted on Jun 3, 2024 5:30PM
ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చివరి కొద్ది గంటలకు చేరుకుంది. బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయ్యే నాటికి మనం జగన్‌ని ‘మాజీ ముఖ్యమంత్రి’ అని అధికారికంగా భావించవచ్చు. దేశవ్యాప్తంగా వున్న దాదాపు 45 సర్వే సంస్థలు ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని స్పష్టంగా చెప్పాయి. ఓ ఐదు పేటీఎం బ్యాచ్ సంస్థలు మాత్రం వైసీపీకి అధికారం కొనసాగుతుందని చెప్పి తమ తోక ఊపాయి. ఈ భజన సంస్థల సంగతి అలా వుంచితే, గత ఎన్నికలలో జగన్‌కి 150 సీట్లు వస్తాయని చెప్పిన కేకే సంస్థ ఈసారి జగన్‌కి 14 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. మరీ పద్నాలుగు సీట్లేంట్రా దేవుడా అనుకుంటూ వుండగానే, ‘ఓపెన్ టాక్ సర్వే’ అనే సంస్థ అయితే జగన్ పార్టీకి ఏకంగా 11 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి వైసీపీ గాలి మరీ దారుణంగా తీసిపారేసింది. ఈ 45 సర్వేలను ఎంతమాత్రం నమ్మని వైసీపీ బ్యాచ్, తమ జేబు సంస్థలు ఐదు చెప్పిన సర్వేలే కరెక్ట్ అంటూ భ్రమల్లో బతికేస్తున్నాయి. ఆ భ్రమలన్నీ మంగళవారం నాడు పటాపంచలు అయిపోతాయి అది వేరే సంగతి.
ఇదిలా వుంటే, శనివారం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దగ్గర్నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లో పరిస్థితి మారిపోయినట్టు సమాచారం. అధికారం చెయ్యి జారిపోతోందని అర్థం చేసుకున్న జగన్ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయినట్టు తెలుస్తోంది. తన అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా వేయని పోలీసులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాగానే, కనీసం తనను సంప్రదించకుండా చంద్రబాబుకి, టీడీపీ కార్యాలయానికి భద్రత పెంచడంతో ఇక పరిస్థితి తన చేయి దాటిపోయిందని జగన్ బాధపడ్డట్టు తెలుస్తోంది. ఇన్ని వేల కోట్లు పంచిపెట్టినా జనం తనను మోసం చేశారని అంటూ ఒక దశలో జగన్ కన్నీరు పెట్టుకున్నారని కూడా సమాచారం.