జగన్ ను అరెస్ట్ చేస్తే ఆ పత్రికపై దాడులు తప్పవా?
posted on Mar 13, 2012 4:35PM
జగన్ ను అరెస్ట్ చేస్తే తమ పత్రికా కార్యాలయాలు, ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చునని ఆ సంస్థల అధినేత ఒకరు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను తమ కార్యాలయాలకు రక్షణ ఇవ్వవలసిందిగా కూడా ఆయన కోరారు. గతంలో వైయస్సార్ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ మీడియా అధిపతి ఇప్పుడు జగన్ పై కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నారు. సిబిఐ విచారణ కథనాలను ఎప్పటికప్పుడు వీక్షకులకు, పాఠకులకు అందిస్తూ జగన్ అరెస్ట్ కావడం తధ్యమంటూ కథనాలు ఇస్తున్నారు. ఈ కథనాలు సహజంగానే జగన్ వర్గీయులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆ పత్రిక, ఆ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాలపు దాడులు జరిపి తమ సత్తా చూపాలని వారు అనుకుంటున్నారు. ఇది గమనించిన ఆ సంస్థల అధిపతి ఇటీవల హైదరాబాద్ లో హోమ్ శాఖ మంత్రి, డిజిపి ణి కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. అరెస్ట్ చేయడానికి ముందే తమ కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆయన కోరినట్లు తెలిసింది.