భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంపై ఐటీ సోదాలు

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ నేతలు ఒకరి తరువాత ఒకరు చిక్కుల్లో పడుతున్నారు. వైసీపీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత ఈ ఐదు నెలల కాలంలో పలువురు నేతలు కేసులను ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన అరాచకం, దోపిడీ, దాడులు, దౌర్జన్యాల కారణంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు.

ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేరారు. గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికలలో భీమవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పట్లో ఆయన జేనసేనాని పవన్ కల్యాణ్ పై  8300 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే 2024 ఎన్నికలలో ఆయన అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుపై 13,726 ఓట్ల తేడాతో  పరాజయాన్ని మూటగట్టుకున్నారు.

ఆ తరువాత నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నారు. ఈ తరుణంగా గ్రంథా నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.   సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో గ్రాంధి నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీ, కృష్ణా జిల్లా నాగాయలంకలోని ఆయన కార్యాలయలపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి.