మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు
posted on Nov 1, 2022 10:53AM
తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మంత్రి జగదీశ్వరరెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక ముందు వరుస ఎదురుదెబ్బలు తగలడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మొన్నటికి మొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించింది. అది అలా ఉంటే ఆ నిషేధం ఇలా ముగిసిందో లేదో సోమవారం రాత్రి నుంచి ఆయన నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు.
తెలంగాణ విద్యుత్ మంతి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం ఒకింత ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకే కొనసాగిన ఈ సోదాలో ఐటీ అధికారులకు భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. అత్యంత గొప్యంగా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
దాదాపు 15 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో అధికారులు పెద్ద మొత్తంలో నగదు, కొన్న డాక్యుమెంట్లు, డైరీలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.