కేసీఆర్, జగన్.. మధ్యలో షర్మిల.. అంతా సెంటిమెంట్ గేమ్? 

ఖమ్మంలో  షర్మిల గర్జించారు. పంచ్ డైలాగులతో కేసీఆర్‌ సర్కారును కుమ్మేశారు. కేసీఆర్ సర్కారును, కల్వకుంట్ల కుటుంబాన్ని ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడుకున్నారు షర్మిల. ప్రజల కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు సభా వేదికగా ప్రకటించారు షర్మిల. తాను కేసీఆర్, జగన్‌లు వదిలిన బాణాన్ని కాదంటూ స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఈ స్థాయిలో కౌంటర్ చేసిన నేత ఈ మధ్య కాలంలో మరెవరూ లేరు. షర్మిల ఇంత ఘాటుగా నిలదీసినా.. అదికార పక్షం నుంచి పెద్దగా ప్రతివిమర్శలు రావడంలేదు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు షర్మిలను లైట్ తీసుకుంటున్నాయి. ఆమె మానాన ఆమెను వదిలేస్తున్నాయి. కేసీఆర్‌పై ఆమె చేసిన విమర్శలు చూస్తుంటే.. నిజంగా ఆమె గులాబీ బాస్‌పై దండెత్తడానికే వస్తున్నారని అనిపిస్తుంది. జగన్‌ను విభేదించే తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు కనిపిస్తోంది. 

అయితే కేసీఆర్ గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఇదంతా కేసీఆర్, జగన్‌లు కలిసి ఆడుతున్న నాటకమని అంటున్నారు. భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రస్తుతం షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని చెబుతున్నారు. ఈ రెండేళ్లు షర్మిలను పొలిటికల్‌గా ప్రమోట్ చేసి.. ఎన్నికల సమయంలో ఆమెను బూచిగా చూపించి ఓట్లు దండుకోవాలనేది కేసీఆర్ వ్యూహం అని భావిస్తున్నారు. అందుకు, వాళ్లు చేసే విశ్లేషణలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఎన్నికల నాటికి షర్మిల పార్టీ తెలంగాణలో కాస్త బలోపేతం అయ్యేలా గులాబీ పార్టీ సహకరిస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు ఏకు మేకుగా మారుతున్న బీజేపీ నుంచి ప్రజల చూపు షర్మిల పార్టీ వైపు డైవర్ట్ చేస్తారు. కాంగ్రెస్‌కూ ప్రత్యామ్నాయంగా షర్మిల పార్టీని ముందుంచుతారు. తెలంగాణలో షర్మిల పార్టీ సెట్ అయ్యాక.. ఎన్నికల సమయంలో ఆ పార్టీ పుట్టి ముంచేస్తారు. షర్మిలకు ఓటేస్తే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే.. మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారంటూ కొత్త వివాదం తెరపైకి తీసుకొస్తారు కేసీఆర్. అక్కడ జగన్, ఇక్కడ షర్మిల.. ఇద్దరు అన్నాచెల్లెల్లు కలిసి రెండు రాష్ట్రాలను మునపటిలా ఏకం చేసి.. మళ్లీ సమైక్యాంధ్ర కోసం ప్రయత్నిస్తారంటూ సెంటిమెంట్ రాజేయడం కేసీఆర్ మైండ్‌గేమ్‌లా కనిపిస్తోందని అంటున్నారు. ఇదంతా అబూత కల్పనగా కొట్టిపారేయలేమని.. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు విషయంలో కేసీఆర్ అదే పని చేశారని గుర్తు చేస్తున్నారు. 

2018లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. గులాబీ బాస్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్, టీడీపీలు ఏకమయ్యాయి. అటు రాహుల్ గాంధీ.. ఇటు చంద్రబాబు చేతులు కలిపారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు. ఇదే కేసీఆర్‌కు అనుకోని వరంగా మారింది. చంద్రబాబును ఆంధ్రా బూచీగా చూపిస్తూ.. మళ్లీ ఆంధ్రా వాళ్ల చేతిలో తెలంగాణను పెడతారా? అంటూ ప్రజలను రెచ్చగొట్టారు. ఓటర్లలో ప్రాంతీయ విధ్వేషం రగిలించారు. ప్రజలూ నమ్మారు. కేసీఆర్‌ను గెలిపించారు. సేమ్ టూ సేమ్.. ఇదే స్ట్రాటజీని ఈసారి షర్మిల పేరుతో కేసీఆర్ ప్లే చేస్తారని అంచనా వేస్తున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించి.. బీజేపీ, కాంగ్రెస్‌ను సైడ్ చేసి.. ప్రజలను కొత్తపార్టీ వైపు మళ్లించి.. ఎన్నికల వేళ షర్మిలను దోషిగా చూపించి.. గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టడమే కేసీఆర్ వ్యూహం అంటున్నారు. 

షర్మిలను గెలిపిస్తే.. జగన్‌తో కలిసి మళ్లీ తెలంగాణ, ఆంధ్రలను కలిపేస్తారని.. ఓటర్లలో సెంటిమెంట్ రాజేసి ఆ మేరకు ఎన్నికల్లో ప్రయోజనం పొందటమే కేసీఆర్ ఎత్తుగడ అని చెబుతున్నారు. షర్మిల స్వతహాగా పార్టీ పెట్టలేదని.. జగన్, కేసీఆర్‌లు కలిసే ఆమెతో పార్టీ పెట్టించారని.. ఇదంతా ఆ ఇద్దరు సీఎంలు ఆడుతున్న రాజకీయ డ్రామా అని ఆరోపిస్తున్నారు. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కేసీఆర్, జగన్‌లు మాయల మరాఠీలే.