యాటిట్యూడే కేసీఆర్ జాతీయ ఆకాంక్షలకు అడ్డం పడుతోందా?

 టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణా ముఖ్య‌మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు మర్యాద గీత ఉంటుందన్న విషయాన్ని ఆయన ఎన్నడూ గుర్తించరు. రాజకీయ అవసరం, లబ్ధికి మించిన ప్రధానమైన అంశమేదీ  ఆయన దృష్టిలో ఉండదు. జాతీయ రాజకీయాలలో అజాత శత్రువుగా అందరూ గౌరవించే మలాయం సింగ్ యాదవ్ గత నెలన్నరగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నా ఒక్క‌సార‌యినా  వెళ్లి ప‌రామ‌ర్శించ లేదు.

 కానీ  జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తన ఆకాంక్ష నెరవేర్చుకోవడం కోసం ఆయన దేశ వ్యాప్తంగా పర్యటనలు చేసి పలువురు రాజకీయ నేతలతో భేటీ అయ్యారు. అంతేనాతనకు మద్దతు లభిస్తుందనుకుంటే.. వారికి చార్టర్ విమానాలు పంపి మరీ ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. అలాగే ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు చార్టర్ విమానాన్ని పంపించి మరీ రాష్ట్రానికి రప్పించారు. ఆయనతో భేటీ అయ్యారు. అయితే కేసీఆర్ జతీయ పార్టీ ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల నుంచీ, ఇతర పార్టీల నాయకుల నుంచీ అనుకున్నవిధంగా స్పందన  రాలేదు. ఇందుకు ఆయన యాటిట్యూడ్  కారణమని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఆయ‌న‌కు రాజ‌కీయ ల‌బ్ధి ఆలోచ‌నే తప్ప ఏ రాజ‌కీయ‌పార్టీతోనూ, నాయ‌కుల‌తోనూ ప్ర‌త్యేకించి సత్సంబంధాలు పెట్టుకున్న‌ట్టు ప్రత్యేకించి రాజకీయ నేతలతో స్నేహ సంబధాలు పెనవేసుకున్న సందర్భమూ లేదు. ఆయన పొత్తులూ, ములాఖత్ లూ అన్నీ రాజకీయమే.  అందుకే అఖిలేష్ కు చార్టర్ ఫ్లైట్ పంపి మరీ ఆహ్వానించిన కేసీఆర్.. అదే అఖిలేష్ తండ్రి తీవ్ర అనారోగ్యంతో దాదాపు నెలన్నరగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే కేసీఆర్ కనీసం ఒక్కటంటే ఒక్కసారైనా వెళ్లి పరామర్శించలేదని రాజకీయ వర్గాలలో విమర్శలు వినవస్తున్నాయి.  

ఇపుడు బీఆర్ ఎస్ పేర జాతీయ రాజకీయాల్లో  చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌కు ద‌క్షిణాది కంటే ఉత్త‌రాది రాజ‌కీయ పార్టీలు, నాయ కుల‌తో స్నేహ‌బంధాలను పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. చిత్ర‌మేమంటే ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న‌కు  ఉత్తరాది నుంచి ఎటువంటి మద్దతూ, ప్రోత్సాహం అభించలేదు. చివరాఖరికి పార్టీ పేరు మార్చిన సభకు హాజరైన   క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార స్వామి కూడా సభ తరువాత స్వరాష్ట్రానికి వెళ్లి తమరాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేయదనీ, తమ పార్టీకి బీఆర్ఎస్ కూ ఎలాంటి పొత్తూ లేదని ప్రకటించారు.  అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ములాయం సింగ్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు కేసీఆర్ యూపీ వెళుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం (అక్టోబర్ 11) జరుగుతాయి.