అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు   భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిులు కోసం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ బెయిలు పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందిగా సింఘీ సుప్రీంను అభ్యర్థించారు. అయితే కోర్టు ఆయనకు జూన్ 1వ వరకూ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని ఈడీ అభ్యంతరం చెప్పింది.

రాజకీయ ప్రచారం కోసం ఒక వ్యక్తికి బెయిలు మంజూరు చేయడం అన్నది ఇప్పటి వరకూ ఎన్నడూ జరగలేదని పేర్కొంది. అయితే కోర్టు మాత్రం ఈ 21 రోజులూ కేజ్రీవాల్ లోపల ఉన్నా, బయట ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేసింది. అలాగే జూన్ 2న ఈడీ అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఇదే మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవితకు పలు మార్లు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.