పవన్ కుమారుడ్ని కాపాడింది భారత్ కార్మికులే!
posted on Apr 12, 2025 2:03PM

సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్రిప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను కాపాడింది భారతీయ కార్మికులే. ఇటీవల సింగపూర్ స్కూల్లో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా సింగపూర్ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. మార్క్‌తో పాటు ఆ ప్రమాదం నుంచి ఇతర పిల్లలను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సత్కరించింది.
సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్‌లో గల ఓ మూడంతస్తుల భవంతిలో ఏప్రిల్ 8న ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఈ వలస కార్మికులు అక్కడికి సమీపంలోనే పనిచేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు విని.. మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించారు. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలకు దిగి.. భవనంలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా కిందకు తీసుకొచ్చారని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది.
వారి ప్రాణాలు పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఆ నలుగురు కార్మికులను సత్కరించినట్లు తెలిపింది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు. బాలుడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి పోస్ట్ పెట్టారు.