ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జి.. చైనా మరో అద్భుతం!
posted on Apr 12, 2025 2:11PM

గాజు వంతెనలు, భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనా మరోసారి ఇంజినీరింగ్ అద్భుతం చేసింది. ఓ భారీ లోయపై రెండు మైళ్ల పొడవుతో వంతెనను నిర్మించింది. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్‌గా నిలవనుంది. ఈ వంతెన నిర్మాణంతో గంట పట్టే ప్రయాణాన్ని నిమిషంలోనే పూర్తి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.
గుయ్‌ఝౌ ప్రాంతంలోని బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జిని నిర్మించారు. 2022లో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా.. కేవలం మూడేళ్లలోపే పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్ట్ కోసం 280 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2400 కోట్లు) ఖర్చు పెట్టారట. ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ వంతెన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ ఏడాది జూన్‌లోని ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో రాకపోకలకు లోయ చుట్టూ తిరిగి అవతలి వైపునకు చేరుకునేందుకు గంట సమయం పట్టేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్‌పై నుంచి కేవలం నిమిషం వ్యవధిలో అవతలి వైపునకు వెళ్లొచ్చని చైనీస్ అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యటక ప్రాంతంగానూ ఈ వంతెన నిలవనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఇలాంటి భారీ వంతెన నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే 100 అత్యంత ఎత్తయిన వంతెనల్లో దాదాపు సగం ఈ దేశంలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.