లంకతో టి20 సిరీస్‌.. క్లీన్‌స్వీప్‌పై భారత్ మహిళా క్రికెటర్ల ఫోకస్

శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌తో.. ఈ ఏడాదికి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాలనుకొంటోంది. అయితే, ప్రత్యర్థి శ్రీలంక మంగళవారం జరిగే ఆఖరి, ఐదో టీ20లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత వరల్డ్‌కప్‌ సన్నాహకాల కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటించనుంది.  2024 టీ20 వరల్డ్‌కప్  లో గ్రూప్‌దశలోనే భారత్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే   హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్ తమ పంథాను మార్చుకొని దూకుడుగా ఆడుతూ  అన్ని జట్లకూ బలమైన ప్రత్యర్థిగా మారింది. ఈ సిరీస్‌లో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో.. తొలి మూడు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది.  భారత్ ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతంగా రాణిస్తోంది. అయితే, భారత ఫీల్డింగ్‌  మాత్రం ఇంకా ఉన్నత ప్రమాణాలను అందుకోలేక పోవడం  ఆందోళనకరం. నాలుగో టీ20లో కూడా రెండు క్యాచ్‌లతోపాటు ఓ స్టంపింగ్‌ అవకాశాన్ని చేజార్చారు. కాగా, ఏడాది తర్వాత పేసర్‌ రేణుక సింగ్‌ పొట్టి ఫార్మాట్‌లోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడం సానుకూలాంశం. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ నిలకడగా రాణిస్తుండగా.. ఈ సిరీస్ లో అరంగేట్రం చేసిన స్పిన్నర్‌ వైష్ణవి శర్మ ఆకట్టుకొంది. డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (48 బంతుల్లో 80) టచ్‌లోకి రావడంతో ఇండియా బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. వన్‌డౌన్‌కు ప్రమోట్‌ అయిన రిచా ఘోష్‌ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకుంది.

జ్వరంతో బాధపడుతున్న జెమీమా రోడ్రిగ్స్‌ ఫిట్‌నెస్ పై ఎటువంటి సమాచారం లేదు. జట్టులోని అందరికీ అవకాశాలు లభించడంతో ఇక మిగిలిన 17 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమలి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. గత మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయిన లంక.. నాలుగో మ్యాచ్‌లో ఛేదనలో దీటుగానే నిలిచింది. ఇదే ఆత్మవిశ్వాసంతో ఈ సిరిస్ ను  విజయంతో ముగించాలని చమరి ఆటపట్టు సేన పట్టుదలతో ఉంది.వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండడంతో టాస్‌ గెలిచిన టీమ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu