అప్పుడే ఓటీటీలోకి 'భారతీయుడు 2'

కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'భారతీయుడు' చిత్రం 1996 లో విడుదలై ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా ఏకంగా 28 ఏళ్ళ తర్వాత రూపొందిన మూవీ 'భారతీయుడు-2' (Indian 2). భారీ అంచనాలతో జూలై 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేక పరాజయం పాలైంది. దీంతో నెల రోజులు కూడా తిరగకుండానే ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెడుతోంది.

'భారతీయుడు-2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆగష్టు 2 లేదా ఆగష్టు 9 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన కేవలం మూడు నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరి ఓటీటీలో ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన 'భారతీయుడు-2'లో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, ప్రియ భవాని శంకర్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.