గుడ్ న్యూస్.. వెనక్కి తగ్గిన చైనా

భారత్-చైనా సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్-చైనా లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు సఫలమయ్యాయి. వాస్తవాధీన రేఖకు చైనా వైపున ఉన్న మోల్డోలో సోమవారం 12 గంటల పాటు లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరపున లిన్ లియు చర్చల్లో పాల్గొన్నారు. తూర్పు లదాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. గల్వాన్‌ లోని 14, 15, 17 పాయింట్లనుంచి తమ బలగాలను వెనక్కు తీసుకునేందుకు చైనా అంగీకరించిందని సమాచారం. చర్చలు మరోమారు జరిగే అవకాశం ఉంది. 

నిజానికి, జూన్ 6న ఇరు దేశాల మధ్య లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి చర్చలు జరిగినప్పుడే గల్వాన్ లో సైన్యాలను ఉపసంహరించుకునేందుకు ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. కానీ ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా టెంట్లను నిర్మించడంతో ఘర్షణ తలెత్తింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, 40 మందికి పైగా చైనా సైనికులు మృతి చెందారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu