శ్వాసతో ధ్యాస పెరుగుతుందట

 


ఊపిరిని ఎప్పుడూ నాసిక ద్వారా పీల్చుకోవాలేగానీ నోటితో పీల్చుకోకూడదని పెద్దలు అంటూ ఉంటారు. ముక్కుతో కాకుండా నోటితో గాలిని పీల్చుకుని వదలడం వల్ల ఊపిరితిత్తుల బలహీనంగా తయారవుతాయని ఆధునిక విజ్ఞానం ధృవీకరిస్తోంది. పైగా ఆస్తమా, రక్తపోటు వంటి ఆరోగ్యసమస్యలు సైతం పలకరిస్తాయని హెచ్చరిస్తోంది. అయితే ముక్కుతోనే గాలిని పీల్చుకోవడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తేలడం ఆశ్చర్యకరం!

 

అనుకోని పరిశోధన

నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొన్ని రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ రికార్డులు మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఓ ఏడుగురు రోగులవి. వీరి మెదళ్ల మీద త్వరలోనే శస్త్రచికిత్సలు జరగనున్నాయి. ఆ శస్త్రచికిత్సల కోసం జరుగుతున్న పరీక్షలలో భాగంగా వారిలో మూర్ఛవ్యాధికి మూలం ఎక్కడుందో కనుగొనేందుకు ఎలక్ట్రోడ్ల సాయంతో... వారి మెదడులో జరుగుతున్న చర్యలన్నింటినీ పరిశీలించి రికార్డులను రూపొందించారు. ఈ రికార్డులను పరిశీలిస్తున్నప్పుడు, రోగులు శ్వాసను పీల్చుకుంటున్నప్పుడు వారి మెదడులో కొన్ని ప్రాంతాలు ఉత్తేజితం కావడాన్ని గమనించారు. ముఖ్యంగా భావోద్రేకాలు, జ్ఞాపకాలను నియంత్రించే కొన్ని భాగాలలో స్పష్టమైన మార్పులు కనిపించాయి.

 

మరో అడుగు ముందుకి

శ్వాసకి సంబంధించి తాము గమనించిన విషయాలు ఎంతవరకు నిజమో తేల్చుకునేందుకు ఒక 60 మంది మీద ప్రయోగాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందులో భాగంగా వారు ఊపిరి పీల్చుకునే సమయంలో వేర్వేరు భావాలను ప్రదర్శించే చిత్రాలను చూపించారు. వాటిలో ఏ చిత్రం ఏ భావాన్ని సూచిస్తుందో ఠక్కున చెప్పమన్నారు. మిగతా ఉద్వేగాలకంటే భయానికి సంబంధించిన చిత్రాన్ని చూపించినప్పుడు... అభ్యర్థులు గబుక్కున వాటిని పోల్చుకున్నారట. అయితే గాలిని ముక్కుతో పీల్చుకునే సమయంలోనే ఇలా త్వరగా స్పందించగలిగారు. గాలిని బయటకు వదిలే సమయంలో కానీ, గాలిని ముక్కుతో కాకుండా నోటితో పీల్చుకున్నప్పుడు కానీ ఇలాంటి ప్రతిభ కనిపించలేదు.

 

జ్ఞాపకశక్తి కూడా

భయాన్ని గుర్తుపట్టే లక్షణమే కాదు... ఏదన్నా వస్తువుని చూసినప్పుడు దానిని దీర్ఘకాలం గుర్తుంచుకోవడంలో కూడా శ్వాస ప్రభావం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు అభ్యర్థులకు కంప్యూటర్‌ తెర మీద వేర్వేరు వస్తువుల చిత్రాలను చూపించారు. తరువాత కాలంలో వాటిని గుర్తుచేసుకోమన్నప్పుడు, ముక్కు ద్వారా గాలిని పీల్చుకునే సందర్భంలో చూసిన చిత్రాలను వారు త్వరగా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని గమనించారు.

 

ఎందుకిలా!

ఊపిరి పీల్చుకునే సమయంలో మెదడుకి తగినంత ప్రాణవాయువు లభిస్తుందన్నది ఈ పరిశోధనతో తేలిపోయింది. దాంతో మెదడు ఆ సమయంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకున్నప్పుడే మెదడుకి తగినంత శక్తి చేరుతోందేమో అన్న విశ్లేషణకు కూడా ఈ ఫలితం తావిస్తోంది. మరి భయానికి సంబంధించిన ఉద్వేగాన్ని గమనించడానికీ, శ్వాసకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నకు కూడా సహేతుకమైన జవాబులే వినిపిస్తున్నాయి. మనిషి ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు, అతని శ్వాస వేగవంతం కావడాన్ని గమనించవచ్చు. దీనివల్ల అతని మెదడుకి త్వరగా కావల్సినంత శక్తి చేకూరుతుంది. ఆ ఆపదని తప్పించుకునేందుకు సమర్ధవంతమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు ఆ శక్తి ఉపయోగపడుతుంది.

 

ఇదీ సంగతి! దీంతో ముక్కుతోనే గాలి పీల్చుకోమని నిరంతరం హెచ్చరించే మన పెద్దల మాట మరోసారి గట్టిగా వినిపించినట్లయ్యింది. పైగా శ్వాస ద్వారా చేసే ప్రాణాయామం వంటి ప్రక్రియల వల్ల మెదడు మరింత చురుగ్గా తయారవుతుందన్న భరోసానీ అందించినట్లయ్యింది.

 

- నిర్జర.