అక్కడ 90 ఏళ్లు మించి బతికేస్తారు - ఎందుకంటే...

 

1990లో మన దేశపౌరుల సగటు ఆయుర్దాయం 58 ఏళ్లు. ఇది ప్రస్తుతం 68 ఏళ్లకు చేరుకుంది. శిశు మరణాలు తగ్గడం, మంచి పోషకాహారం, మెరుగైన వైద్య సదుపాయాలు వంటి కారణాల వల్లే ఈ మార్పు వచ్చిందని మన ప్రభుత్వాలు సంబరపడుతూ ఉంటాయి. కానీ మిగతా దేశాలతో పోలిస్తే మన సగటు ఆయుర్దాయం చాలా దారుణం. ఆయుర్దాయాల జాబితాలో మనది ఏకంగా 164వ స్థానం. ఇదిలా ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు ఉలిక్కిపడేలా మరో సర్వే వెలుగులోకి వచ్చింది.

 

బ్రిటన్లోని ప్రఖ్యాత Imperial College London, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ సర్వేను నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితులని అంచనా వేస్తూ 2030 నాటికి వేర్వేరు దేశాలలోని ఆయుర్దాయం ఎలా ఉంటుందనేదే ఈ సర్వే లక్ష్యం. ఇందుకోసం వారు 35 అభివృద్ధి చెందిన దేశాల తాలూకు గణాంకాలను సేకరించారు. ఇందులో దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాలు మెరుగ్గా కనిపించాయి. 2030నాటకి అక్కడి సగటు మనిషి ఆయుర్దాయం 90 ఏళ్లకు మించిపోతుందట. కేవలం దక్షిణ కొరియానే కాదు... స్విట్జర్లాండ్, కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాలెన్నో 80 ఏళ్లకు మించిన సగటు ఆయుర్దాయాన్ని సాధిస్తాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

 

పై జాబితాను చూడగానే దక్షిణ కొరియాలో అంతేసి ఆయుర్దాయం ఉండేందుకు కారణాలు ఏమిటి అన్న అనుమానం రాక మానదు. ఎదిగే వయసులో తగిన పోషకాహారం అందడం, రక్తపోటు అదుపులో ఉండటం, పొగతాగే అలవాటు లేకపోవడం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పుల మీద ఎప్పటికప్పుడు అవగాహన ఏర్పరుచుకోవడం వంటి చర్యల వల్లే అక్కడి ఆయుర్దాయం అద్భుతంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కొరియా సంగతి అలా ఉంచితే అమెరికా వాసుల ఆయుర్దాయంలో మాత్రం 2030 నాటికి పెద్దగా మార్పులు రాకపోవచ్చునని తేలింది. పెరిగిపోతున్న ఊబకాయం, పేట్రేగుతున్న హత్యల కారణంగా వారి సగటు ఆయుష్షు 80 ఏళ్లలోపే ఉంటుందట.

 

ఒకప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం 90 ఏళ్లు దాటడం అసాధ్యం అనుకునేవారు. కానీ ఆ ఊహ కేవలం అపోహేనని తాజా సర్వే రుజువుచేస్తోంది. 65 ఏళ్లు దాటినవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిక్షేపంగా నిండు నూరేళ్లు జీవించవచ్చని చెబుతోంది. అంతేకాదు! ఒకప్పుడు ఆడవారికంటే మగవారు త్వరగా చనిపోతారనే నమ్మకం కూడా ఉండేది. అనారోగ్యకరమైన అలవాట్లు, హత్యలకు దారితీసే గొడవలు, రోడ్డు ప్రమాదాల కారణంగా వారు కాస్త త్వరగానే తనువు చాలించేసేవారు. కానీ రానురానూ మగవారి జీవిత విధానం బోలెడు జాగ్రత్తలతో నిండిపోతోందట. కాబట్టి మున్ముందు మగవారికీ, ఆడవారికీ మధ్య ఆయుర్దాయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని చెబుతున్నారు.

 

సర్వే జరిగిన దేశాల జాబితాలో మన దేశం లేదు. కానీ ఈ సర్వే నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. విజ్ఞానరంగం అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహిస్తే చాలు సెంచరీ కొట్టేయడం అసాధ్యం కాదు. అలాగే 60వ వడిలో పడిన వృద్ధులకి ప్రభుత్వరం ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ తగిన భరోసాని కల్పించగలిగితే వారు హాయిగా మరెంతో కాలం జీవించే అవకాశం ఉంది.

- నిర్జర.