జగన్ నిర్వాకం.. త్రిశంకు స్వర్గంలో హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌  పదేళ్లపాటు   ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అయితే ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసిపోతుంది. అంటే ఆ తేదీ నాటికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలన్నిటినీ ఖాళీ చేసి ఏపీకి తరలించేయాలి. అయితే ఏపీకి రాజధానే లేని పరిస్థితి. కార్యాలయాలను ఎక్కడికి తరలించాలో అర్ధంకాని అయోమయ స్థితి. అయితే  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోతుండటంతో  ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తెలంగాణకు అప్పగించేసి అక్కడి ఫర్నీచర్, సిబ్బందిని ఏపీకి తరలించేసి తీరాలి.  అలా చేయలేకపోతే.. ఆ భవనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ రెండు వరకూ మాత్రమే. ఆ తరువాత హైదరాబాద్ మహానగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది.  

ఐదేళ్ల పదవీ కాలంలో అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ హడావుడి చేసిన జగన్ సర్కార్ మూడు రాజధానులలో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు. దీంతో  హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడకు తరలించినా వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో స్పష్టత లేని స్థితి. దీంతో హైదరాబాద్ ను మరో ఏడాది పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని  జగన్ సర్కార్ అభ్యర్థించింది. అయితే ఆ అభ్యర్థనను సహజంగానే తెలంగాణ సర్కార్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  అయితే, రెండు ప్రభుత్వ కార్యాలయాలు మరియు లేక్ వ్యూ అతిథి గృహాన్ని ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   ఆదర్శ్ నగర్‌లోని హెర్మిటేజ్ భవనం, లక్డీకాపూల్‌లోని సీఐడీ భవనం, లేక్ వ్యూ అతిథి గృహాలను అద్దె చెల్లించైనా సరే వినియోగించుకునేందుకు జగన్ సర్కార్ రెడీగా ఉన్నట్లు తెలుస్తున్నది.  

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పదేళ్లపాటు పంచుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నప్పటికీ.. సొంత రాజధాని నిర్మాణం వేగవంతంగా జరగాలంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏపీలోనే ఉండాలన్న ఉద్దేశంతో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు   2017లో నే చాలా వరకూ ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేయడమే కాకుండా హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు చెల్లిస్తాం అక్కడే కొనసాగించుకునేందు అనుమతించండి మహప్రభో అని వేడుకుంటున్నారు.