తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి 10వేల కోట్లు!

తెలంగాణ వార్షిక బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేశారు. తెలంగాణ ఆర్థిక మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల రూపాయలతో  రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన భట్టి.. తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ మహానగరం అభివృద్ధికి పది వేల కోట్ల రూపాయలు కేటాయించారు.

ఇంత భారీగా హైదరాబాద్ నగరానికి కేటాయింపులు జరపడం ఇదే మొదటి సారి. విశ్వనగరంగా మారుస్తున్నాం అంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ హైదరాబాద్ కు బడ్జెట్ లో  ఈ స్థాయి కేటాయింపులు జరిగిన దాఖలాలు లేవు. ఈ పది వేల కోట్ల రూపాయలలో 3,065 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల కల్పనకు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక సదుపాయల కల్పనకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మోట్రోవాటర్ వర్క్స్ కు   3,385 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక హైడ్రా కు 200 కోట్ల రూపాయలు, మెట్రో రైలు ను విమానాశ్రయం వరకూ విస్తరించేందుకు  100  కోట్ల రూపాయలు కేటాయించారు.

ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రెండు వందల కోట్ల రూపాయలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు.  అలాగే మెట్రోరైల్ విస్తరణకు 500, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థకు 500 కోట్ల రూపాయలు కేటాయించారు.  అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రిక లాంటి ముసీ సుందరీకరణ ప్రాజెక్టుకు 1500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు.