మైండ్ షార్ప్ గా ఉండాలంటే.. ఇలా చేయండి..!
posted on Sep 2, 2024 9:30AM
మానవ శరీరంలో మెదడు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మెదడు సరిగా పనిచేస్తెనే మనిషి జీవితం మెరుగ్గా ఉంటుంది. లేకపోతే జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఎదైన పనిని మర్చిపోయినా, ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టి గుర్తు లేదని చెప్పినా చాలామంది అప్పుడే మతి మరుపు వచ్చిందా అని.. మెదడు తక్కువ వెధవా అని.. మెదడు మోకాలిలో ఉందా అని అంటుంటారు. అయితే మెదడు చురుగ్గా పని చేయడం మన చేతిలోనే ఉంది. మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని టిప్స్ ను పాటించాలి. అవి కూడా ఉదయాన్నే పాటించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
నీరు..
ఉదయాన్నే గోరువెచ్చని నీరు, లేదా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగాలి. చల్లని నీటిని, ఫ్రిడ్జ్ లో ఉంచిన నీటిని తాగకండి. వెచ్చని నీరు, సాధారణ ఉష్ణోగ్రత నీరు మెదడు పనితీరును మెరుగపరుస్తుంది. అలగే ఇది జీర్ణక్రియను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
ధ్యానం..
ఉదయాన్నే ధ్యానం చేసేవారి మెదడు పనితీరు సాధారణ వ్యక్తుల కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ధ్యానం మెదడును ఒత్తిడి నుండి బయటకు తెస్తుంది. మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి సామర్థ్యము పెంచుతుంది. అలాగే ధ్యానం లో భాగంగా చేసే శ్వాస వ్యాయామాలు కూడా మెదడును, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. ధ్యానం వల్ల స్థిరచిత్తం అలవడుతుంది. ఏకాగ్రత కూడా మెరుగవుతుంది.
ఆహారం..
మెదడు ఆరోగ్యం భేషుగ్గా ఉండాలంటే మెదడుకు బూస్టింగ్ ఇచ్చే ఆహారాలను ఉదయాన్నే తీసుకోవాలి. ఉదయం తీసుకునే ఆహారంలో పోషకాలు మెండుగా ఉండాలి. సీజనల్ పండ్లు, కూరగాయలతో పాటు.. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారం తినాలి.
వ్యాయామం..
ఉదయాన్నే యోగా లేదా వ్యాయామం చేస్తే మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు చురుగ్గా మారుతుంది. ఒంట్లో బద్దకం వదిలిపోతుంది. ఇది రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది.
సమీక్ష..
ఉదయాన్నే ఆ రోజు ఏమేం పనులు చేయాలో ఒక ప్రణాళిక వేసుకోవాలి. 100శాతం చేయలేకపోయినా, కనీసం దరిదాపుల్లో పనులన్నీ చక్కబెట్టడం వీలవుతుంది. ఇది పని ఒత్తిడిని తగ్గిస్తుంది. వాయిదా అలవాటు లేకుండా చేస్తుంది. దీని వల్ల మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
*రూపశ్రీ.