ప్రాణాలు తీస్తున్న Hot Water Challenge
posted on Feb 16, 2019 10:57AM
జనానికి ఏమొచ్చినా పట్టడం కష్టం. మొన్నటి వరకూ Cold Water Challenge పేరుతో చల్లటి నీళ్లు ఒకరి మీద ఒకరు దిమ్మరించుకునేవాళ్లు. ఇహ ఇప్పుడు Hot Water Challenge శకం మొదలైంది. ఏడాది క్రితం మొదలైన ఈ సరదా ఇప్పుడు వెర్రి తలలు వేసి ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఎవరన్నా తన స్నేహితుడి మీద వేడి వేడి నీళ్లు పోయడం కానీ... వేడి నీళ్లు బలవంతంగా తాగమని ఛాలెంజ్ చేయడం కానీ చేస్తారు.
ఈ ఛాలెంజ్ వల్ల వచ్చే సరదా ఏంటో కానీ వేడి నీళ్లు పడ్డ ప్రతివాళ్లకీ ఒళ్లు బొబ్బలెక్కి హాస్పిటల్‌లో చేరే పరిస్థితులు వస్తున్నాయి. ఇక వేడి నీళ్లు తాగినవాళ్లకి అయితే నోరు, గొంతు కాలిపోయి మూగ, చెవిటివాళ్లుగా మారిపోతున్నారు. వేడి వేడి నీళ్లు తాగడం వల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా రికార్డు అవుతున్నాయి. వేడి నీళ్ల వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని తెలియని పిల్లలు మాత్రం ఈ ఛాలెంజ్ మోజులో పడి స్నేహితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
మనం వేడి చేసే నీళ్లు సాధారణంగా 120 డిగ్రీలు దాటితే SECOND DEGREE BURNS ఖాయం. అంటే చర్మపు పై పొరతో పాటు రెండో పొర కూడా దెబ్బతింటుంది. ఇలా ఏర్పడే గాయాలు ఓ పట్టాన తగ్గకపోగా చాలా బాధని కూడా మిగులుస్తాయి. ఇక 150 డిగ్రీలు దాటితే THIRD DEGREE BURNS తప్పవు. అంటే చర్మం లోపల ఉండే కొవ్వు కూడా దెబ్బతిని, నరాలు కూడా పాడైపోతాయి. ధర్డ్ డిగ్రీ బర్న్స్ వల్ల ఒకోసారి ఎముకలు కూడా బయటపడవచ్చు.
హాట్ వాటర్ ఛాలంజ్ వెనకాల ఇంత బాధ ఉందన్నమాట! ఇలాంటి సంఘటనలు జరిగాక తెగ బాధపడే కంటే ముందే ఇంట్లో పిల్లలకి వేడి నీళ్లతో ఎప్పుడూ చెలగాటం ఆడొద్దని ఓ గట్టి వార్నింగ్ ఇవ్వాలి. యూట్యూబ్‌లో వేడి నీళ్లు పడటం వల్ల కలిగే అనర్థాలు ఓసారి చూపిస్తే ఇక వాటి జోలికే పోకుండా ఉంటారు.
- నిర్జర.