తెలంగాణలో పరువు హత్య
posted on Mar 28, 2025 10:47AM

తెలంగాణలో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కోపంతో పెద్దపల్లి జిల్లాలో 17 ఏళ్ల యువకుడిని ఆ అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాయికుమార్ గౌడ్ అదే గ్రామానికి చెందిన సదయ్య కుమార్తెతో ప్రేమలో పడ్డాడు.
వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన సదయ్య కోపంతో రగిలిపోయాడు. చదువు సంధ్యలు లేకుండా గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న సాయికుమార్ తన కుమార్తెతో ప్రేమలో పడటం సదయ్యకు నచ్చలేదు. మందలించినా ఫలితం లేకపోవడంతో సాయికుమార్ ను గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. తన పుట్టిన రోజును స్నేహితులతో జరుపుకుంటున్న సాయికుమార్ ను సదయ్య గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.