తెలంగాణలో నిప్పులు చెరుగుతున్న భానుడు.. మరో నాలుగు రోజులు అంతే!

తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.

కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకూ నమోదౌతాయని పేర్కొంది. ముఖ్యంగా కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, పాలమూరు, భూపాలపల్లిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. శని, ఆదివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాదరి, వరంగల్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. కాగా శుక్రవారం ( మే3) రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే మే 4, 5 తేదీలలో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  ఇవి వినా మిగిలిన అన్ని జిల్లాలకూ రానున్న నాలుగు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారి చేసింది.

తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతందనీ,  అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండలు మండుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలో వాతావరణం వేడిగా ఉంటుందనీ, వడగాడ్పులు వీస్తాయనీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతున్న నేపథ్యంలో ఎండ వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది. మండే ఎండలకు తోడు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.