మాజీ మంత్రి కాకాణికి హైకోర్టు షాక్.. ఇక అరెస్టేనా?

అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 1) కొట్టివేసింది.

 ఈ కేసులో అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించజాలమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసులకు భయపడనంటూ గంభీర ప్రకటనలు చేసిన కాకాణి తీరా పోలీసులు నోటీసులు అందజేయడానికి వస్తే అజ్ణాతంలోకి వెళ్లి పోవడం తెలిసిందే.  

వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ4గా పోలీసులు చేర్చారు. వరుసగా రెండు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి, మంగళవారం (ఏప్రిల్ 1)న తాను బుధవారం తరువాత అంటే గురువారం అందుబాటులో ఉంటాను అంటూ సమాచారం పంపారు.  అదే సమయంలో కాకాణి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా, పోలీసులు కాకాణి విచారణకు గైర్హాజర్ అయిన విషయాన్నీ అలాగే రెండు రోజులుగా నోటీసులు తీసుకోకుండా కాకాణి తప్పించుకు తిరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.