తెలంగాణలో కొత్త సచివాలయం

 

తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. సికింద్రాబాద్ బైసన్‌పోలో గ్రౌండ్‌‌లో సచివాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. గ్రౌండ్‌పై తగిన నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి స్వేచ్ఛను ఇస్తూ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించుకోవచ్చుని హైకోర్టు సూచించింది. బైసన్‌పోలో గ్రౌండ్‌ను రాష్ట్రానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది పూర్తిగా క్రీడా మైదానమని,ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దంటూ కొందరు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. దీంతో బైసన్ పోలో గ్రౌండ్స్‌కు సంబంధించిన భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కేంద్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఈ మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ కొద్ది రోజుల్లోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  బైసన్ పోలో గ్రౌండ్స్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కొన్నేళ్ల క్రితమే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం... ఇందుకు సంబంధించి ప్లాన్‌ను కూడా సిద్ధం చేసింది. నిర్మాణ మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే సచివాలయం నిర్మాణం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది. కొత్త సచివాలయంతో పాటు ఇదే ప్రాంగణంలో కళాభారతిని కూడా నిర్మించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. సచివాలయం కోసం బైసన్ పోలో స్థలం కేటాయించాలని గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినతిపత్రం సమర్పించింది.