గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇలా సాధ్యం!
posted on Feb 23, 2023 9:30AM
చలి పంజాకు ఈ సంవత్సరం చాలా గట్టిగానే దెబ్బ తిన్నారు ప్రజలు. ఈ చలి ప్రభావం వల్ల ఎంతో మంది శ్వాశ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. మరికొందరు మరణించారు కూడా. చలి ముఖ్యంగా శ్వాస నాళం మీద ప్రభావం చూపినప్పటికీ శరీరంలో కీలకమైన ఊపిరితిత్తులు, గుండె ఈ చలి ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. ప్రస్తుతం శివరాత్రి గడిచిపోయిన తరువాత చలి ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తగ్గిపోయి మెల్లగా వేసవి వైపు అడుగులు పడుతున్నాయి. చాలామందికి ఈ సమయం ఎంతో విలువైనది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారికి, వ్యాయామం చక్కగా చేసి ఫ్యాట్ బర్న్ చెయ్యాలని అనుకునేవారికి ఇది బెస్ట్ సీజన్. అయితే ఈ మూమెంట్ లో గుండె ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలండోయ్..
జిమ్ లలోనూ.. ఆరు బయట, రోడ్ల మీద నడక నుండి విభిన్న రకాల వ్యాయామాలు చేస్తూ చేస్తూనే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలేస్తున్న వారు ఉన్నారు ఇప్పట్లో. అందుకే ఈ సీజన్ లో గుండె ఆరోగ్యం ఇలా.. పదిలం చేసుకోండి.
గుండె పర్ఫెక్ట్ ఉండాలంటే.. అందరూ గుర్తుంచుకోవలసిన అయిదు విషయాలు..
హైడ్రేటెడ్ గా ఉండాలి
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన మోతాదులో నీరు తాగడం చాలా అవసరం. నీరు శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపుతుంది. గుండెను సరైన రీతిలో పని చేయడానికి సహకరిస్తుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని గుర్తుపెట్టుకోవాలి.
వ్యాయామం ఇలా..
రెగ్యులర్ గా చేసే వ్యాయామం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హృదయాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఎంతో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.
గుడ్ ఫుడ్..
శరీర ఆరోగ్యానికి ఆహారమే గొప్ప ఔషధం. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో షుగర్, కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే గుండెకు చేటు చేసే కొవ్వులు వాటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చెయ్యడం మంచిది.
ఒత్తిడి మీద మంత్రం..
ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఒత్తిడి కారణంగానే చాలా వరకు అనారోగ్య సమస్యలు, హైపర్ టెన్షన్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. యోగా లేదా ధ్యానం వంటి విశ్రాంతినిచ్చే మార్గాలను ఎంచుకోవడం, వాటిలో పాల్గొనడం ద్వారా ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు.
బ్యాడ్ హాబిట్స్ కు బై బై..
గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. అలాగే ఊపిరితిత్తుల వినాశనానికి కూడా ఇదే కారణం. ధూమపానం మానేయడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రత్యక్ష పరోక్ష ధూమపానం వల్ల అందరి ఆరోగ్యాలు పాడవుతాయి. అదే ధూమపానం మానేస్తే మీ ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గుండె పదిలంగా, ఆరోగ్యం అద్భుతంగా ఉండాలంటే ఈరోజే ఈ చెడు అలవాటుకు చెక్ పెట్టేయండి.
పైన చెప్పుకున్న అయిదు విషయాలు చాలా సింపుల్ గా పాటించేవి. కానీ వాటి వల్ల కలిగే బెనిఫిట్ మాత్రం మీ జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇచ్చేయండి.
◆నిశ్శబ్ద.