స్మృతి ఇరానీ తల పట్టుకున్న మాయవతి..!
posted on Apr 26, 2016 3:12PM
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిని అభిమానులు అపర కాళీకాదేవిగా మార్చారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మాయావతి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాళీమాత ముఖాన్ని తొలగించి అక్కడ మాయావతి చిత్రాన్ని పెట్టారు. కాలికింద రాక్షసుడి స్థానంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ని పెట్టారు. కాళీమాత మెడలో ఉండే పుర్రల స్థానంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి తలను పెట్టారు. కాళీ మాత మరో చేతిలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తలను నరికి పట్టుకున్నట్లుగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మరో పక్క నిల్చుని కాళీమాతను శరణు కోరుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. దాంతోపాటుగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు రద్దే చేయబోనని చెబుతున్నట్లు రాశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి పోస్టర్ల ద్వారా బీఎస్సీ మత కల్లోలాన్ని ప్రోత్పహిస్తోందన్నారు. ఆ పార్టీ గతంలో కూడా హిందూ దేవతల్ని ఎగతాళి చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడి కోరి ఇబ్బందులు తెచ్చుకుంటోందని బీజేపీ వ్యాఖ్యానించింది.