మోడీ జీ పాఠాలు నేర్చుకున్నారా..?
posted on Dec 18, 2017 3:47PM

చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి. ప్రధాని కంచుకోట అయిన గుజరాత్ లో మోడీ చాలా కష్టంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలు ఒక ఎత్తైతే.. గుజరాత్ ఎన్నికలు ఒకత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లాంటిది కాదు గుజరాత్. వెనకబడిన రాష్ట్రం స్థాయి నుంచి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం స్థాయికి ఎదిగింది. దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రిగా చేసిన, నాటి దేశ ప్రధాని మోడీయే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు బలహీన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి జాతీయస్థాయిలో తిరుగులేని అధికారం వచ్చిందంటే దానికి మోడీయే కారణం. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నిక్లలో బీజేపీ ఎక్కడా తిరుగులేకుండా గెలిచి అధికారాన్ని చేపట్టింది. ఉత్తర భారతదేశంలో దాదాపు బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో కూడా అధికారం చేజిక్కించుకుంది. కానీ ఈ గెలుపేమీ అంత ఈజీగా వచ్చింది ఏం కాదు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీయే కదా.. చాలా ఈజీగా గెలవొచ్చు అనుకుంది బీజేపీ. కానీ.. ఇక్కడే బీజేపీ పప్పులో కాలేసింది. బీజేపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు అయింది. ఈ నాలుగేళ్లలో.. మొదట బాగానే ఉన్నా.. రాను రాను మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల.. బీజేపీ పై వ్యతిరేక భావం ఏర్పడింది. నోట్ల రద్దు విషయంలో కానీ, జీఎస్టీ, దళితుల పై దాడులు, ఇంక గుజరాత్ లో పటేళ్ల రిజర్వేషన్లు... ఇలా పలు అంశాలపై ప్రజల్లో బీజేపీపై వ్యతిరేక భావం ఏర్పడింది. ఇదే కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది. ఇక రాహుల్ గాంధీ అయితే గతంలోలా కాకుండా... మాటతీరు మార్చి ఓ రకంగా బీజేపీకి చుక్కలు చూపించాడు. తన ప్రసంగాలతో.. ప్రధాని మోడీపై విమర్శలు, సెటైర్లు వేయడం మాటలు బాగానే నేర్చుకున్నాడు అని అనుకునేలా చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయినా.. రాహుల్ గాంధీపై మాత్రం పాజిటివ్ టాకే వచ్చింది.
మరి ఇప్పటికైనా మోడీ కళ్లు తెరిస్తే ఓకే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. లేదంటే కష్టమే. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పరిపాలనతో విసిగిపోయిన జనం..బీజేపీకి పట్టం గట్టారు. ఈ నాలుగేళ్లలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలపై జనం కోపంగా ఉన్నారు. అయితే కోపంగా ఉన్నా.. దేశం ప్రస్తుతానికి కాంగ్రెస్ ను ఆహ్వానించే పరిస్థితిలో లేదు. అదే సమయంలో వారు మోడీ – షాల నియంతృత్వ పోకడలు కూడా హర్షించడం లేదు. దీనికి గుజరాత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. సో మోడీ ద్వయం దానిని ఎంత త్వరగా గుర్తిస్తే 2019 అంత తేలిక అవుతుంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ, షాలు గుణపాఠాలు నేర్చుకుంటే మంచిది.