పటేళ్లు కూడా బీజేపీకే.. ఎందుకు..?
posted on Dec 18, 2017 10:57AM
.jpg)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీనే ఎర్పడింది. క్షణక్షణానికి ఫలితాలు తారు మారవుతూ... అందరినీ టెన్షన్ పెట్టాయి రెండు పార్టీలు. కానీ బీజేపీనే అధికారం చేజిక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ కు కాస్త నిరాశే మిగిలింది. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు గతంలో కన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లనే గెలుచుకుంది. అనేక అంశాలను కాంగ్రెస్ లేవనెత్తి బీజేపీని ఇరుకున పెట్టింది. అందులో ముఖ్యంగా పటేళ్ల రిజర్వేషన్ల అంశం. ఒక పక్క రాహుల్ గాంధీ, మరోపక్క హార్టిక్ పటేల్ ఎటాక్ చేయడంతో.. బీజేపీ గెలవడం కాస్త కష్టమే అనుకున్నారు. ఈ ఎన్నికల్లో పటేళ్ల రిజర్వేషన్ల అంశం కీలక పాత్ర పోషిస్తుందని అందరూ భావించారు. సూరత్ జిల్లాలోని కమ్రేజ్, వర్చా, కటార్గాం, కరాంజ్, ఓల్పాద్, ఉత్తర సూరత్ ప్రాంతాల్లో పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు అక్కడ ప్రచారానికి వచ్చిన బీజేపీ నేతలను సైతం అడ్డుకున్నారు. అలాంటిది.. ఇక్కడ కూడా బీజేపీనే అధిక్యతలో నిలిచింది. పటేళ్ల బలం ఎక్కువగా ఉన్న 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 22 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.
మొత్తానికి ఇన్నాళ్లు పటేళ్ల రిజర్వేషన్లకు పోరాడిన హార్టిక్ పటేల్ కు సైతం షాకిచ్చి.. బీజేపీకి ఓటెయ్యడం గొప్ప విషయమే. ఇన్ని రోజులు రిజర్వేషన్లు కావాలని పోరాడిన వాళ్లే, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లే ఎందుకు ఓటేసినట్టు.వాళ్లకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఎందుకు పక్కన పెట్టినట్టు. అంటే కాంగ్రెస్ పై వాళ్లకు నమ్మకం లేదా..? ఎందుకో అది వాళ్లకే తెలియాలి. మరి పటేళ్లు కూడా మోడీ ప్రసంగాలకు పడిపోయారేమో. అందుకే బీజేపీకే పట్టం గట్టారు.