హైదరాబాదు పరిధిలో గవర్నరుకే సర్వాధికారాలు
posted on Aug 9, 2014 8:50AM
.jpg)
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాదులో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత, సర్వాధికారాలు గవర్నరుకు కట్టబెడుతూ రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దానికి తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతుండటంతో, గవర్నర్ నరసింహన్ తన అధికారాలు, బాధ్యతలపై మరింత వివరణ కోరుతూ కేంద్రానికి ఒక లేఖ వ్రాసారు. దానిపై కేంద్రం స్పందిస్తూ రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నరుకు శాంతిభద్రతల పర్యవేక్షణాధికారాలు కల్పించేవిధంగా తెలంగాణా ప్రభుత్వం తన నియమనిబంధనలు మార్చుకోవలసిందిగా కోరుతూ ఒక లేఖ వ్రాసింది. కానీ అందుకు తెలంగాణా ప్రభుత్వం నిరాకరించడంతో, ఇక కేంద్రమే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోకతప్పలేదు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ పరిధిలో గవర్నరుకు సర్వాధికారాలు కట్టబెడుతున్నట్లు తెలియజేస్తూ తెలంగాణా ప్రభుత్వానికి నిన్న లేఖ పంపింది.
ఆ లేఖలో మార్గదర్శకాల ప్రకారం ఇక నుండి హైదరాబాదులో శాంతి భద్రతల పర్యవేక్షణాధికారాలన్నీ గవర్నరుకే సంక్రమిస్తాయి. హైదరాబాదు పరిధిలో పోలీసు వ్యవస్థ అంతా గవర్నరుకే జవాబుదారీగా ఉంటుంది తప్ప తెలంగాణా ప్రభుత్వానికి కాదు. అందువల్ల ఇకపై పోలీసు అధికారులు అందరూ గవర్నరు ఆదేశాల ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. వారి బదిలీలు, పదోన్నతులు అన్నీ కూడా గవర్నరు చేతిలోనే ఉంటాయి. అవసరమనుకొంటే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులను, అధికారులను హైదరాబాదులో నియమించుకొనే అధికారం గవర్నరుకు ఉంటుంది. అవసరమనుకొంటే హైదరాబాదు పరిధిలో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులతో ఉమ్మడి పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయవచ్చును.