ఏపీలో ఐపీఎస్ ల బదిలీ
posted on Jan 14, 2025 9:49AM
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రాతో పాటు నంద్యాల ఏఎస్పీగా మందా జావళి అల్ఫోన్, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన తరువాత కూడా పోలీసు శాఖ పనితీరు సరిగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికీ కొందరు పోలీసు అధికారులు పాత పద్ధతులు మార్చుకోలేదనీ, వైసీపీకి కొమ్ము కాస్తున్నట్లుగానే వ్యవహరిస్తున్నారన్న అసహనం కూటమి ప్రభుత్వ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పారు. తిరుమల తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరును సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు సైతం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ద్వారా పోలీసు శాఖలో ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాటినట్లైంది.