బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్.. తిరుపతి ఘటనపై అసత్య ప్రచారాలకు ఎండ్ కార్డ్
posted on Jan 14, 2025 5:21AM
తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమలకు వస్తుంటారు. ప్రతీ రోజూ దాదాపు అరవై వేలకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల నిత్యం స్వామినామస్మరణంతో మారుమోగిపోతుంది. అలాంటి తిరుమలలో గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎన్నో అపచారాలు జరిగాయి. లడ్డూ తయారీలో వాడే నెయ్యి విషయం దగ్గర నుంచి.. తిరుమలలో టికెట్ల పంపిణీ.. ఉద్యోగుల నియామకం ఇలా అన్నిఅంశాల్లోనూ వైసీపీ హయాంలో అనేక తప్పులు జరిగాయి. మొత్తంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసే స్థాయికి గత పాలకుల నిర్ణయాలు వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో అధికారులు తిరుమల ప్రక్షాళనకు నడుం బిగించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తున్నారు. దీంతో తిరుమలను దర్శించుకునే భక్తుల తాకిడి క్రమంగా మరింత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో ఆరుగురు మరణించగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు జగన్, వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు.
తిరుపతిలో టోకెన్ల పంపిణీ సమయంలో ఆరుగురు మృతిచెందడం చరిత్రలోనే తొలిసారి. ఒకరిద్దరు అధికారుల కారణంగా ఈ ఘటన జరిగింది. అయితే, ఘటన జరిగిన వెంటనే టీడీపీ పాలక మండలి అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం వెంటనే స్పందించారు. ఘటన జరిగిన కొన్నిగంటలకే వారు తిరుపతికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణలో ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిలను సస్పెండ్ చేయడంతోపాటు.. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను బదిలీ చేశారు. గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారివద్దకు వెళ్లిన చంద్రబాబు.. వారిని పరామర్శించి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. అంతేకాక మరుసటిరోజే వారికి ప్రత్యేక వైకుంఠ ద్వారా దర్శనం ఏర్పాటు చేయించారు.
అయితే, జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనను రాజకీయం చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. క్షతగాత్రుల పరామర్శ పేరుతో ఆస్పత్రికివచ్చిన జగన్, వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. ఒకరిద్దరే రావాలని వైద్యులు వారించినా వినకుండా జగన్ సహా మరో పదిమంది వైసీపీ నేతలు లోపలికి వెళ్లారు. దీనికితోడు జగన్ వచ్చే ముందే పలువురికి ఓ వైసీపీ నేత తెల్లకవర్లు పంచిపెట్టడం సీసీ కెమెరాల్లో రికార్డు కావటంతో వైసీపీ కుట్రకోణం బయటకొచ్చింది. కవర్లో డబ్బులిచ్చి చంద్రబాబు వల్లనే ఆ ఘటన జరిగిందని చెప్పించే ప్రయత్నం చేసింది వైసీపీ బ్యాచ్. చంద్రబాబు సకాలంలో స్పందించడంతో ఘటనను రాజకీయంగా వాడుకోవాలన్న వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది.
అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి అవి నిజమని ప్రజలను నమ్మించేలా చేయడంలో జగన్, వైసీపీ నేతలు దిట్ట. దీనికి తోడు జగన్ సొంత మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఉండనే ఉంది. ఘటన జరిగిన తొలి రెండు రోజులు చంద్రబాబు కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ వైసీపీ మీడియా ప్రచారం చేసింది. వారి ప్లాన్ బెడిసికొట్టడంతో ఈ ఘటనకు కారణం చైర్మన్, ఈవో అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టింది వైసీపీ బ్యాచ్. చైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపం, విభేదాలే ఈ ఘటనకు కారణమని సొంత జగన్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశాయి. చైర్మన్, ఈవోకు వేంకటేశ్వర స్వామి అంటే భక్తిలేదని, తిరుమలలో రాజకీయాలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశాయి. తాజాగా వైసీపీ తప్పుడు ప్రచారాలపై టీటీడీ చైర్మన్, ఈవో మీడియా సమావేశం పెట్టి సీరియస్ అయ్యారు. టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ అసత్య ప్రచారాలకు ఎండ్ కార్డు పడినట్లయింది.