అనారోగ్యం... ఆస్పత్రిలో ఆహుతి ప్రసాద్
posted on Dec 16, 2014 8:50AM

ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆయన ఆరోగ్యం అదుపులోకి రాకపోవడంతో సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆహుతి ప్రసాద్‌కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన ఆహుతి ప్రసాద్‌ని బంధువులు, స్నేహితులు, సినీ రంగానికి చెందిన వారు పరామర్శిస్తున్నారు. ఆహుతి ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు. ‘ఆహుతి’ సినిమా ద్వారా గుర్తింపు పొందిన ఎజెవి ప్రసాద్, ప్రేక్షకులకు ‘ఆహుతి’ ప్రసాద్‌గా గుర్తుండిపోయారు. ఆ తర్వాత వచ్చిన ‘పోలీసు భార్య’ సినిమా ద్వారా మరింత మంచి గుర్తింపును పొందారు. మొదట్లో విలన్ వేషాలు వేసిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. ఆమధ్య వచ్చిన ‘చందమామ’ సినిమాలో ఆయన ధరించిన కేరెక్టర్ నటుడిగా ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది. ఆ సినిమా ద్వారా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి స్మారక అవార్డు అందుకున్నారు. తన పేరులో ‘ఆహుతి’ అని వుండటం తనకు అభివృద్ధి నిరోధకంగా మారిందని ఆయన భావించేవారు. తన పేరును ఎజెవి ప్రసాద్ అని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నప్పటికీ ఆయన్ని అందరూ ‘ఆహుతి’ ప్రసాద్ అనే పిలుస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.