ఫామ్ హౌస్ కేసు.. సుప్రీంలోనూ కేసీఆర్ సర్కార్ కు దక్కని ఊరట

ఫామ్ హౌమ్ కేసు లో బీఆర్ఎస్ ప్రభుత్వం పీకల్లోతు ఇరుక్కుందా? ఫాం హౌస్ కేసులో ఫైళ్లు సీబీఐ చేతికి ఇస్తే ప్రభుత్వానికి చిక్కులు తప్పవా? అలా ఇవ్వకుండా మొండి కేస్తే కోర్టు ధిక్కరణ నేరాన్ని ఎదుర్కొన వలసి ఉంటుందా? ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఎదుట నిలిచిన చిక్కు ప్రశ్నలివే.  ఈ కేసులో సిట్ కు దర్యాప్తును అప్పగించడం నుంచి బీఆర్ఎస్ సర్కార్ వేసినవన్నీ తప్పటడుగులేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడం.. మళ్లీ డివిజన్ బెంచ్ సూచన మేరకు సింగిల్ బెంచ్ కు వెళ్లడం.. అక్కడితో ఆగకుండా సుప్రీంను ఆశ్రయించడంతో ఈ కేసు విషయం ఇక ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని తేలిపోయింది. సింగిల్ బెంచ్ సుప్రీం కోర్టులోనే తేల్చుకోండని చెప్పేసినా.. సుప్రీం కోర్టు ప్రభుత్వం కోరిన విధంగా వెంటనే అత్యవసరంగా ఈ కేసు విచారణకు స్వీకరించడానికి సుప్రీం కోర్టు నిరాకరరించింది. ఈ నెల 17న విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకూ స్టేటస్ కో ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా సుప్రీం కోర్టు పట్టించుకోలేదు.  దీంతో విచారణకు పదిహేడో తేదీ వరకూ ప్రభుత్వం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ లోగా సీబీఐ విచారణ ప్రారంభించేస్తుందన్న ఆందోళన కేసీఆర్ సర్కార్ లో కనిపిస్తోంది.  ఈ కేసుకు సంబంధించిన ఫైళ్ల కోసం సీబీఐ ఇప్పటికే సీఎస్ కు మూడు సార్లు లేఖల ద్వారా కోరింది. అయితే అటు నుంచి ఎటువంటి స్పందనా కానరాలేదు.

ఇప్పుడు తాజాగా సీబీఐ మరో లేఖ రాసింది. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.  మొదటి నుంచీ ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసులో ‘సిట్’ ఏర్పాటు విషయంలో  మొదటి నంచి అనుమనాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో ఏర్పాటు చేసిన  సిట్  కూర్పు, విషయంలో అనుమనాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే, సిట్  అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పద  మయ్యాయి. న్యాయ స్థానాలు సైతం సిట్  గీత దాటిందని పేర్కొన్నాయి.  కీలక కేసుల్లో సిట్‌ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో ఆ అనుమానాలు మరింతగా బలపడ్డాయి. 

ఈ నేపధ్యంలోనే, విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదన్న పిటిషర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో సిట్‌ను విచారణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.  ఈ తీర్పునే ఇప్పుడు డివిజన్ బెంచ్ సమర్ధించింది. సుప్రీంను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయిస్తే.. అత్యవసర విచారణ అవసరం లేదంటూ 17న విచారణకు స్వీకరిస్తామని పేర్కొంది. ఆలోగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించకుండా స్టేటస్ కో ఇవ్వడానికి కూడా సుప్రీం నిరాకరించింది. దీంతో ఇక ఈ కేసు విషయంలో సుప్రీం వేగం పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలో కాలు పెట్టకుండా అడ్డుకునేందుకు  జనరల్  కన్సెంట్ రద్దు చేసినా,  కోర్టు తీర్పుతో ఆ కన్సెంట్ ఎందుకూ కొరగాకుండా పోయింది.