ఇ వీసా సేవలు ప్రారంభించిన రాజ్‌నాథ్...
posted on Nov 28, 2014 3:12PM
విదేశాల నుంచి ఇండియాకి వచ్చే పర్యాటకులను ఆకర్షించి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వీసా సదుపాయాన్ని కొత్తగా ప్రారంభించింది. దీనికి మొదటి దశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్‌తోపాటు 43 దేశాలకు చెందిన పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా అందుబాటులోకి రానుంది. ఎలక్టానిక్ వీసా సౌకర్యాన్ని ప్రారంభించిన తర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ భారత్‌లో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యమన్నారు. ఇ - వీసా కోసం విదేశీ పర్యాటకులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లోగా టూరిస్ట్ వీసా అందిస్తామని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, యూఏఈ, జోర్దాన్, కెన్యా, ఫిజీ, ఫిన్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్, మారిషస్, నార్వే, ఫిలిప్ఫీన్స్ తదితర దేశాల టూరిస్టులకు ఈ ఇ-వీసా సౌకర్యం కల్పించారు. కొన్ని ‘ప్రమాదకర’ దేశాలు మినహా అన్ని దేశాల పర్యాటకులకు దశలవారీగా ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తామని రాజ్‌నాథ్ తెలిపారు.