ఎన్నికలంటే భయమా? నిమ్మగడ్డే అడ్డమా? 

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఎన్నికల సంఘం తీసుకోనుంది. అయితే ఈ సమావేశానికి హాజరు కావడం లేదని అధికార వైసీపీ ప్రకటించింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎస్ఈసీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన వైసీపీ.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నా సహకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

 

కరోనా ప్రభావం ఉన్నా గతంలో స్థానిక ఎన్నికలు జరపాలని పట్టుబట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వ స్పందన రాజకీయ, న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనాతో దేశం మొత్తం లాక్ డౌన్ విధించేసినా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టింది వైసీపీ సర్కార్. ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఫైరయ్యారు సీఎం జగన్. మంత్రులు, వైసీపీ నేతలైతే ఆయన్ను దారణంగా టార్గెట్ చేశారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించారు. ఎస్‌ఈసీని కూడా తొలగించి రచ్చ రచ్చ చేసింది ప్రభుత్వం. కొత్త ఎన్నికల కమిషనర్ ను కూడా హడావుడిగా నియమించింది. అయితే ప్రభుత్వ చర్యలపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై నానా రభస చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహణకు వ్యతిరేకిస్తుండటంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.

 

ప్రస్తుతం దేశం కరోనా భయం నుంచి బయటపడుతోంది. ఏపీలో కూడా లాక్ డౌన్ ఎత్తేశారు. బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అయినా స్థానిక ఎన్నికలకు అధికార పార్టీ ఆసక్తి చూపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం నిర్వహించకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి వరకూ.. ఎస్‌ఈసీ పదవీ కాలం ఉంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించి.. అ దిశగానే జగన్ సర్కార్ కార్యాకరణ రూపొందించిందని తెలుస్తోంది.

 

మరోవైపు విపక్షాలు మాత్రం స్థానిక ఎన్నికలకు వైసీపీ భయపడుతుందని ఆరోపిస్తున్నాయి. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న తతంగంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయాయని, గతంలో వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లాయని, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని చెబుతోంది. ఇటీవల వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. సర్కార్ నిర్లక్ష్యం వల్లే కరోనా కేసుల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందనే విమర్శలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ భయపడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే దేశంలో కరోనా కేసులు నమోదు కావడంతో అంతటా భయాందోళన నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ఆగిపోతే.. తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని వైసీపీ చెబుతోంది. ఎస్‌ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణపై చీఫ్‌ సెక్రటరీ గాని, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సెక్రటరీ గాని సంప్రదించలేదని ఆరోపిస్తోంది. ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా  రాజకీయపార్టీలను పిలవటంలోనే... ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతుందని చెబుతోంది వైసీపీ. ఎన్నికల నిర్వహణను ఒక పవిత్ర మైన రాజ్యాంగ కర్తవ్యంగా కాకుండా ఒక డ్రామాగా నిమ్మగడ్డ భావిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ

 

మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కీలక  వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఎన్నికలు నిర్వహించేలా ఈసీకి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల నిర్వహణపై తమను ఎన్నికల కమిషన్ సంప్రదించాలన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా? అని ప్రశ్నించింది.ఏయే చోట్ల ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదో.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది హైకోర్టు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై ప్రజ్లలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.