ఏపీకి కొత్త డీజీపీ.. జగన్ ఫిర్యాదుతో ఈసీ ట్విస్ట్!!
posted on Mar 6, 2019 10:50AM
ఏపీకి కొత్త డీజీపీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాగానే డీజీపీని మార్చాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. గత నెలలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వైసీపీ అధినేత జగన్.. ఏపి డీజీపీ ఠాకూర్ పై ఫిర్యాదు చేసారు. ఠాకూర్ టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. తనపై హత్యా యత్నం జరిగిన సమయంలోనూ డీజీపీ ఏక పక్షంగా వ్యవహరించారని.. ఆయన అధికార పార్టీ నేతలకు మద్దతు గా ఉన్నారని జగన్ ఫిర్యాదు చేసారు. ఆయన్ని ఎన్నికల విధుల నుండి దూరంగా పెట్టాలని జగన్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్దించారు. దీంతో ఠాకూర్ ను ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల నుండి పక్కన పెట్టాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఠాకూర్ స్థానంలో గతంలో విజయవాడ కమిషనర్ గా పని చేసి.. ప్రస్తుతం విజిలె న్స్ డీజీగా ఉన్న గౌతం సవాంగ్ కు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. డీజీపీగా ఠాకూర్ నియామక సమయంలోనూ సవాంగ్ పేరు చర్చకు వచ్చింది. అయితే అప్పుడు చంద్రబాబు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే. .ఠాకూర్ ను తప్పించి సవాంగ్ కు అవకాశం ఇస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనకు ఇన్‌ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.