టీడీపీ తరపున ఎంపీగా మాజీ కలెక్టర్!!

 

గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రిని తాటికొండ ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా బాపట్ల ఎంపీ అభ్యర్థి కోసం పలువురి పేర్లుని కూడా పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ విషయమై కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాల్యాద్రితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తాటికొండ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికలో వచ్చిన సమస్య పరిష్కారానికి ఈ సరికొత్త వ్యూహాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తాటికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ని, కొందరు స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయాన్ని అటు సీఎం, ఇటు పార్టీ రాష్ట్ర నాయకులకు వారు తెగేసి చెప్పారు. దీంతో సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరొందిన మాల్యాద్రిని తెరమీదికి తీసుకురావడం వల్ల తాడికొండలో అసమ్మతికి చెక్ పెట్టే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఇదే విషయంపై సుజనాతో మాట్లాడిన చంద్రబాబు.. పార్టీ అవసరాల రీత్యా మాల్యాద్రిని అసెంబ్లీకి మార్చాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారాయని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇదే సమయంలో బాపట్ల ఎంపీ అభ్యర్థి ఎంపికపై కూడా పలు పేర్లుని టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ను బాపట్ల ఎంపీ బరిలోకి దించే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలో గతంలో కలెక్టర్‌గా పనిచేసి గత ఎన్నికల సమయంలోనే టీడీపీ టిక్కెట్‌ ఆశించి భంగపడిన దేవానంద్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరి పేర్లుని కూడా టీడీపీ పరిశీలనలోకి తీసుకుంది. అయితే తాటికొండ విషయంలో తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతే బాపట్ల ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఒక నిర్ణయానికి రావచ్చని విశ్వసనీయ సమాచారం.