ఇబ్రహీం రైసి చ‌నిపోతే... ఇరాన్ ప్ర‌జ‌లు పండ‌గ చేసుకున్నారు!

దివంగ‌త నేత‌ ఇబ్రహీం రైసిలో రెండు కోణాలున్నాయి. ఒకటి నిరంకుశ మతోన్మాదం, రెండవది తిరుగులేని సామ్రాజ్యవాద వ్యతిరేకత. ఆయ‌న చ‌నిపోయిన సంఘ‌ట‌న మతవర్గాలలో దిగ్భ్రాంతి క‌లిగించింది. మ‌రో వైపు ఇరాన్ దేశమంతటా సామాన్య జనంలో సంతోష ఛాయలు క‌నిపించాయి. ఎందుకంటే.... హిజాబ్‌ ధరించకుండా ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణతో మహషా అమీని ప్రాణాలు తీశారు. మత ఛాంద‌సంతో నైతిక పోలీసింగ్ పేరిట‌, ఆమెకు నీతి పాఠాలు బోధిస్తూ, చిత్ర హింసలు పెడుతూ ప్రాణాలు తీశారు. ఈ సందర్భంగా ఇబ్రహీం రైసి మతాధినేతకు చూపిన విధేయత కారణంగా ఖమేనీకి తగిన వారసుడు అతనే అనే అభిప్రాయం కలిగింది.

అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసి తీసుకున్న చర్యలు జనంలో తీవ్ర అసంతృప్తి, నిరసనలకు దారితీశాయి. ముఖ్యంగా నైతిక పోలీసులను రంగంలోకి దించి సమాజాన్ని మత గిరి నుంచి కదలకుండా చేసేందుకు చూశాడు. ఈ క్రమంలోనే మహషా అమీ అనే యువతిని పోలీసు కస్టడీలో చంపివేయటంతో గడచిన ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు ఐదు వందల మంది నిరసనకారులను చంపివేశారంటే అణచివేత ఎంత క్రూరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వందలాది మంది జాడ ఇప్పటికీ తెలియదు. వారిని కూడా చంపివేశారా, జైళ్లలో ఉంచారా అన్నది కూడా స్పష్టం కాలేదు. 

1998లో 30వేల మందికి పైగా రాజకీయ ఖైదీలను ఉరితీశారు. వీరిలో అధికులు పీపుల్స్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ప్రత్యర్ధులే ఉన్నారు. చరిత్రలో అత్యంత హీన నేరగాండ్లుగా నమోదైన వారి జాబితాలో చేరి ఈ మారణకాండకు బాధ్యులైన ముగ్గురిలో ఇబ్రహీం రైసీ ప్రముఖుడు.  యువకుడిగా ఉన్నపుడే మత ఛాందసాన్ని వంటబట్టించుకున్న ఇబ్రహీం రైసి 1979లో ఇరాన్‌ ఇస్లామిక్‌ విప్లవం పేరుతో జరిగిన పరిణామాల్లో ఖమేనీ అనుచరుడిగా ఉన్నాడు. తరువాత మరింత సన్నిహితుడిగా, దేశ సర్వాధినేతను ఎంపిక చేసి, పర్యవేక్షణ చేసే నిపుణుల కమిటీలో 2006 నుంచి పనిచేశాడు. 2021లో దేశ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా వీర విధేయుడిగా ఎదిగాడు.  అనేక అక్రమాలు, అనేక మంది అభ్యర్థులను పోటీకి అనర్హులుగా చేసిన 2021 అధ్యక్ష ఎన్నికలలో అడ్డగోలు పద్ధతిలో గెలిచాడనే విమర్శలు ఉన్నాయి. రైసీకి మతపెద్దలతో పాటు మిలిటరీ మద్దతు కూడా ఉన్న కారణంగానే ఎన్నిక సాధ్యమైందని చెబుతారు. 

ఖమేనీ న్యాయమూర్తుల అధిపతిగా ఉన్న రైసీ 2019లో తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేతలుగా ఉన్న వారితో సహా తరువాత తన పదవీ కాలంలో మొత్తం పదిహేను వందల మందిని ఉరితీయించాడు. తాను అధ్యక్షుడైన తరువాత 2022లో తలెత్తిన నిరసనల సమయంలో 750 మంది ఉన్నారు.  జైళ్లు, ఇతర నిర్బంధ శిబిరాలలో మధ్యయుగాలనాటి ఆటవిక పద్ధతుల్లో వేలాది మందిని చిత్రహింసలకు గురిచేశాడు.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

Online Jyotish
Tone Academy
KidsOne Telugu