అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం.. తక్కువ స్థాయిలో సునామీ కూడా 

అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. దీని ప్రభావం వల్ల సోమవారం స్వల్ప సునామీ తీరానికి వచ్చింది. ఐతే ఈ భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత మంది చనిపోయారన్న వివరాలు ఇంకా అందవలసి ఉంది. అయితే భారీ భూకంపం రావడంతో... నష్టం కూడా ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. అయితే భూకంపం వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేయగా... తీరం వెంట ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

 

భూకంపం వచ్చిన అలస్కా కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాండ్ పాయింట్ నగరం తీరంలో సముద్రపు అలలు 2 అడుగుల ఎత్తుకి ఎగసిపడ్డాయని తెలుస్తోంది. తీరం నుంచి 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావం వల్ల కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకూ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూకంపం వచ్చిన మొదట్లో భారీ సునామీ రావచ్చని అధికారులు అంచనా వేసినా తర్వాత స్వల్ప సునామీగా హెచ్చరికను మార్చారు. అయితే భూమి చాలా లోతున భూకంపం వచ్చింది కాబట్టి... మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది.