‘దోచేయ్‌’ షార్ట్ రివ్యూ...



నాగచైతన్య, కృతి సనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘దోచెయ్’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, చేయ‌ని నేరానికి సీతారామ్ (రావు ర‌మేష్‌) జైలుపాలై యావ‌జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తుంటాడు. సీతారామ్ కొడుకు... చందు(నాగ చైతన్య).   "మంచితనం మాట్లాడటానికి పనికి వస్తుంది కాని బతకడానికి కాదు అనే మాట న‌మ్ముతాడు. అందుకే.. చెల్లాయిని మెడిసెస్ చ‌దివించ‌డం కోసం మోస‌గాడిగా మార‌తాడు.  చందుకి మీరా(కృతి సనన్) పరిచయం అవుతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు. మాణిక్యం (పోసాని) త‌న ముఠాతో బ్యాంకుల్ని లూఠీ చేయిస్తుంటాడు. ఓ బ్యాంక్‌లో రెండు కోట్లు ఎత్తేసిన ముఠా స‌భ్యులు ఒక‌రిని కాల్చుకొని మ‌రొక‌రు చ‌నిపోతారు. ఆ డ‌బ్బు అనూహ్యంగా చందుకి దొరుకుతుంది. ఆ డ‌బ్బుతో త‌న తండ్రిని జైలు నుంచి విడిపించుకొందామ‌నుకొంటాడు చందు. అయితే ఈ డ‌బ్బు కో్సం మాణిక్యం, ఆ ఏరియా సీఐ రిచ‌ర్డ్ (ర‌విబాబు) వెంట‌ప‌డ‌తారు. ఆ డ‌బ్బుని చందూ ఎలా కాపాడుకొన్నాడు. త‌న తండ్రిని జైలు నుంచి ఎలా విడిపించుకొన్నాడు?  అస‌లు సీతారామ్ జైలులో ఉండ‌డానికి కార‌ణం ఏమిటి?  అనేదే చిత్ర క‌థ‌.


స్వామిరారాతో సుధీర్ వ‌ర్మ‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ న‌మ్మ‌కం క‌లిగింది. ఈ సినిమాలో  క‌థ - క‌థ‌నాల దృష్ట్యా అతను బాగా నిరుత్సాహ‌ప‌రుస్తాడు. క్రైమ్ కామెడీని ఎలా న‌డిపించాలో స్వామి రారాతో ఓ పాఠంగా చెప్పిన సుధీర్‌.. ఎలా తీయ‌కూడ‌దో ఈ సినిమాతో మ‌ళ్లీ తానే చూపించాడ‌నిపించింది.

నాగ‌చైత‌న్య ఎప్ప‌ట్లా న‌టించేశాడు. ఆటోన‌గ‌ర్ సూర్య‌కీ, మ‌నంకీ, దోచేయ్‌కి న‌ట‌న‌లో ఎలాంటి మార్పూ చూపించ‌లేక‌పోయాడు. ఎన‌ర్జిటిక్ గా క‌నిపించాల్సిన సీన్స్‌లో నీర‌సంగా ఎలా న‌టించ‌గ‌లుగుతున్నాడో, ఆ సీక్రెట్ ఏంటో చైతూనే చెప్పాలి.