దంత సంరక్షణ ఎంత ముఖ్యం?

ఉదయం లేవగానే అందరూ చేసే పని పండ్లు తోముకోవడం. చాలామంది ఉదయం లేవగానే పండ్లు తోముకోకుండా కాఫీ తాగడం చేస్తారు. మరికొందరేమో నైట్ డ్యూటీ లు గట్రా చేస్తూ నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర క్యూ కడతారు. అయితే ఉదయం లేవగానే పండ్లు తోముకోవడం అనే అలవాటు చాలా మంచిది. పండ్లు తోముకోవడం కూడా ఓ కళ అంటారు దంత వైద్య నిపుణులు.

మన పండ్లను సరైన రీతిలో బ్రష్ చేసుకోవాలి. బ్రష్ ను గట్టిగా ముందుకు, వెనుకకు తోమకూడదు. అలా తోమటం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. ముందుగా పండ్లు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్ చాలా మెత్తగా ఉండాలి. అలా ఉంటే పండ్ల చిగుళ్లు దెబ్బతినవు.

ఇక పండ్లు తోముకునేటప్పుడు బ్రష్ తో పైకి, కిందికి మెల్లగా తోముకోవాలి. అలా చేయటం వల్ల చిగుళ్ళకు నష్టం వుండదు. మన పండ్లను బ్రష్ తో తోముకున్న తర్వాత చేతి వ్రేళ్ళతో చిగుళ్ళను తోముకోవాలి. అందువల్ల చిగుళ్ళు దృఢంగా తయారవుతాయి. కొంతమంది ఇటుకపొడి, బొగ్గు మొదలైన గరుకు పదార్థాలతో పండ్లను తోముతారు, కాని అలా తోమకూడదు. ఎందుకంటే అవి పండ్లపై ఉన్న ఎనామిల్ ను తొలగించి నష్టపరుస్తాయి. ఒకవేళ అవి ఉపయోగించేలా అయితే మెత్తగా పొడిని జల్లించుకోవాలి.  లేదంటే పండ్లకు మంచి టూత్ పేస్ట్ వాడటం చాలా అవసరం. ఎందుకంటే ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్ట్ లు వాడటం వల్ల దంతక్షయం అరికట్టబడుతుంది. చిగుళ్ళు గట్టిగా, దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. 

ఎవరైనా సరే చాక్లెట్లు, పిప్పరమెంట్లు, మిఠాయిలు ఎక్కువగా తినకూడదు. తీపి పదార్థాలు పండ్ల సందులలో చిక్కుకొని సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. తద్వారా పండ్లు పుచ్చిపోతాయి. ప్రతీరోజూ ఉదయం బ్రష్ చేసేటప్పుడు నాలుక గీసుకొని శుభ్రపరచుకోవాలి. నాలుక పైన రాత్రిపూట ఒక తెల్లని పూత ఏర్పడుతుంది...! నాలుకపైన పేరుకున్న ఈ తెల్లని పూతను అప్ఆర్ఇంచుకుని సుక్మాజీవుల పెరుగుతాయి. ఈ పూతను ఎప్పటికప్పుడు తొలగించకపోతే సూక్ష్మక్రిములు పెరిగిపోయి దుర్వాసన కల్గుతుంది…

మనం తీసుకునే ఆహరంతో పాటు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలో ప్రవేశించి చాలా రకాల  వ్యాధులు కల్గుతాయి. భోజనం చేసిన తర్వాత నీటిని పుక్కిలించి నోటిని శుభ్రపరచుకోవాలి. నోటిలో చిక్కుకున్న ఆహారపు అణువులు తొలగించటానికి ప్రతిసారి భోజనము తర్వాత నీటిని పుక్కిలించి ఉమ్మివేయాలి. అప్పుడు నోరు శుభ్రంగా, వాసన లేకుండా ఉంటుంది. సంవత్సరానికి కనీసం ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించాలి. పండ్లు అందంగా ఆకర్షవంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సంవత్సరానికి కనీసం ఒకసారి దంత వైద్యునితో పండ్లను పరీక్ష చేయించుకోవాలి. దంత వైద్యులు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించాలి. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

                                          ◆నిశ్శబ్ద.