త‌ప్పుమీద త‌ప్పు.. పుంగనూరు పుడింగికి జైలే దిక్కు!?

ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోబోతుందా?  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చ‌వి చూసిన వైసీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌బోతుందా?  అంటే రాజకీయవర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.  వైసీపీలో కీల‌క నేత‌ అయిన  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వి కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  రామ‌చంద్రారెడ్డి చేసిన త‌ప్పులు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని తెలుతుండటంతో  హైకోర్టు ఆయ‌న‌పై అనర్హత వేటువేసే అవ‌కాశాలు  ఉన్నాయని అంటున్నారు. ఇటీవ‌ల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థులు కేవ‌లం 11 మంది మాత్ర‌మే విజ‌యం సాధించారు. వారిలో జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మిన‌హా మిగిలిన వారంతా దాదాపు కొత్త‌ వారే. దీంతో అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు.   తాజాగా పుంగ‌నూరు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వి పోయే ప్ర‌మాదం ఏర్ప‌డ‌టంతో వైసీపీ శ్రేణుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఇంత‌కీ పెద్దిరెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వి పోయే ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డింది?  ఆయనపై  హైకోర్టులో పిటిష‌న్ ఎవ‌రు దాఖ‌లు చేశారు? మదనపల్లె రికార్డుల దహనం కేసుకు.. పెద్దిరెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వి పోయే ప‌రిస్థితి ఏర్ప‌డ‌టానికి కార‌ణం ఏమిటి?  అనే విష‌యాల‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెలకొంది.

మంచి చెడులతో పని లేకుండా దేనికైనా తెగించే పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ సెగ  మొదలైంది.  పెద్దిరెడ్డి పాపాల  పుట్టలు అన్నీ పగ‌ల‌బోతున్నాయ‌ని తెలుగుదేశం కూటమి నేత‌లు అంటున్నారు. మొత్తానికి రెండు కేసుల్లో పెద్దిరెడ్డి కటకటాల పాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.  వైసీపీ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద‌ మొత్తంలో దోపిడీకి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి.

తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పెద్దిరెడ్డి దోపిడీలు  ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు  పెద్దిరెడ్డి త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో చూప‌ని ఆస్తులు చాలా ఉన్నాయ‌ని, వాటి వివ‌రాల‌తో కూడిన ప‌క్కా ఆధారాల‌తో  బీసీవై పార్టీ అధినేత బోడె రామ‌చంద్ర యాదవ్ హైకోర్టులో పిటిష‌న్ వేశాడు. ఆ పిటిష‌న్ పై హైకోర్టులో  విచార‌ణ జ‌రిగింది. ఇరు ప‌క్షాల న్యాయ‌వాదులు స‌హా, పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల అధికారి కూడా కోర్టుకు వ‌చ్చారు. పెద్దిరెడ్డి అన‌ర్హుడిగా మారితే త‌ర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు. ఆయన కూడా ఈ కేసులో ముఖ్యమే, ఆయనను కూడా విచారణలో భాగస్వామి చేస్తూ నోటీసులు ఇవ్వండి, ఇంప్లీడ్ చేయండని హైకోర్టు ఆదేశించింది.  

ఈ కేసులో  ఇది కీలక పరిణామంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు..  గ‌తంలోనూ పెద్దిరెడ్డిపై ఇలాంటి కేసు న‌మోదైంది.  2014 ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పెద్దిరెడ్డి భార్య తన కంపెనీలో డైరెక్టరుగా వున్నా కూడా హౌస్ వైఫ్ అని చూపించారు. ఎన్నిక‌ల త‌రువాత పెద్దిరెడ్డిని అనర్హుడుగా ప్రకటించమని అప్పటి పుంగునూరు తెలుగుదేశం  అభ్యర్థి వెంకటరమణరాజు కోర్టుకు వెళ్లాడు. అది సుప్రీం కోర్టు వరకు చేరింది. అప్పట్లో సుప్రీం కోర్టు తీర్పు రిజర్వుచేసింది.  

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వైసీపీ  హ‌యాంలో మంత్రి హోదాలో కీల‌క వ్య‌క్తిగా చ‌లామ‌ణి అయ్యారు. ఆ స‌మయంలో వీలైన‌న్ని ప్ర‌భుత్వ భూముల‌ను త‌న భార్య‌, ఇత‌ర బినామీల పేర్ల‌పై న‌మోదు చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయన భూ దందాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌స్తున్నాయి. వాటిల్లో 142 ఆస్తుల‌ను పెద్దిరెడ్డి ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో చూపించ‌లేద‌ని రామ‌చంద్ర యాదవ్ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ఈ కేసు విచార‌ణ కీల‌క ద‌శ‌లో ఉంది. పెద్దిరెడ్డిని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించేందుకు అన్ని సాక్షాల‌ను సేక‌రించిన త‌రువాతే రామ‌చంద్ర యాద‌వ్ పిటిష‌న్ వేశారు. ఈ కేసులో పెద్దిరెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎమ్మెల్యే ప‌ద‌వికి అన‌ర్హుడిగా వేటుకు గురికావ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

ఈ కేసుని పూర్తిగా పరిశీలిస్తే.. దీనిలో పేర్కొన్న 142 అక్రమాస్తుల వివరాలు మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలోనే ఉన్నాయి. కోర్టు విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఎన్నికల అధికారికూడా కోర్టుకి వెళ్లి సమాధానం చెప్ప‌డం కేసు  తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తున్నది. అందుకే ఈ పిటిషన్ దాఖలైనప్పటి నుండి తప్పించుకోవడానికి పెద్దిరెడ్డి, ఆయ‌న వ‌ర్గం అన్నిర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మదనపల్లె సబ్ కలక్టరేట్ లోని రికార్డులను తగలబెట్టార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

అన్న‌మ‌య్య జిల్లా స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌య ప్ర‌మాద ఘ‌ట‌న కేసులో విచార‌ణ వేగంగా కొన‌సాగుతోంది. ఈ ప్ర‌మాదంలో మొత్తం 2,400 రికార్డులు కాలిపోయిన‌ట్లు, 700 రికార్డులు స‌గం వ‌ర‌కు కాలిపోయిన‌ట్లు అధికారులు గుర్తించారు. స‌గం కాలిపోయిన రికార్డుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న 37మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో పెద్దిరెడ్డి అనుచ‌రుడు మాధ‌వ్ రెడ్డి ప‌రారీలో ఉండ‌టంతో అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ కావ‌డంతో డీజీపీతో స‌హా ఉన్న‌తాధికారులు రంగంలోకిదిగి ఘ‌ట‌న‌కు సంబం ధించిన పూర్తి ఆధారాల‌ను సేక‌రిస్తున్నారు. ఈ కేసులో పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చుబిస్తోంది. రికార్డుల ద‌గ్దం కేసులో అన్నివేళ్లూ పెద్దిరెడ్డి అనుచ‌రుల వైపే చూపుతుండ‌టంతో పెద్దిరెడ్డికి ఉచ్చుబిగుసుకోవ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక‌వైపు హైకోర్టులో ఎన్నిక‌ల అఫిడ‌విట్ పై విచార‌ణ‌.. మ‌రోవైపు రికార్డుల ద‌గ్దం కేసు. ఈ రెండు కేసుల్లోనూ పెద్దిరెడ్డి ఇరుక్కోవ‌టం ఖాయ‌మ‌ని, ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు  ప్ర‌మాదంలో ప‌డే ప‌రిస్థితి రాబోతుంద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. అయితే, ఈ కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు పెద్దిరెడ్డి వైసీపీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న ప్రచారం కూడా ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu