కేసీఆర్ లో గజ్వేల్ ఉప ఎన్నిక భయం.. అసెంబ్లీకి ఒక్క రోజు హాజరు అందుకేనా?
posted on Mar 21, 2025 9:49AM
.webp)
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై.. అధికారానికి దూరమైన క్షణం నుంచీ రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అనే విధంగా యాక్టివ్ పోలటిక్స్ కు దాదాపు దూరమయ్యారు. అయితే అప్పుడప్పుడు మాత్రం తాను మళ్లీ క్రియాశీలం అవుతాననీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాననీ చెబుతూ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారానికి దూరమైన ఈ 15 నెలల్లోనూ ఆయన అసెంబ్లీకి హాజరైంది కేవలం రెండు సార్లు మాత్రమే. రెండు మూడు సార్లు మాత్రమే బహిరంగంగా సభలలో మాట్లాడారు.
అంతే మిగిలిన కాలమంతా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ఆయన తాను రాజకీయంగా క్రియాశీలం అవుతాననీ, అసెంబ్లీకి హాజరై ప్రభుత్వాన్ని నిలదీస్తాననీ గట్టిగా చెప్పారు. అన్నట్లుగానే అసెంబ్లీకి వచ్చారు. అదీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సెషన్ కు మాత్రమే. ఆ తరువాత మళ్లీ అసెంబ్లీ ముఖం చూడలేదు. యథాప్రకారం ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఈ 15 నెలల కాలంలోనూ ఆయనను ఎవరైనా కలవాలనుకున్నా.. లేదా ఆయన ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా వేదిక ఫామ్ హౌస్ మాత్రమే. ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఫామ్ హౌస్ వీడి తెలంగాణ భవన్ కు వచ్చారు. అప్పుడూ అంతే ప్రసంగం ముగించేసి మళ్లీ ఫామ్ హౌస్ కు చేరిపోయారు. ప్రస్తుతం సభలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది కానీ కేసీఆర్ మాత్రం సభకు రాలేదు. దీంతో ఆయన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీకి వచ్చింది. మొక్కుబడి తంతుకోసమేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలోనే కాదు, బీఆర్ఎస్ శ్రేణులలో కూడా వ్యక్తం అవుతోంది.
ఆయన అసెంబ్లీకి హాజరైంది.. కేవలం హాజరు కోసమేనా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం శాసనసభ సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజుల పాటు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే గైర్హాజరుగా ప్రకటించవచ్చు. అదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి భయపడుతున్నారా? అందుకే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అసెంబ్లీలో హాజరు వేయించుకుని మళ్లీ ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఉద్యమ కాలం నుంచీ ఉప ఎన్నికలను పార్టీ పటిష్ఠతకు, ఉద్యమ బలోపేతానికి అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్న కేసీఆర్ ఇప్పుడు ఉప ఎన్నిక అంటేనే భయపడుతున్నారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకోవానికే కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యారా, ఈ విషయంలో ఆయన పొరుగు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు జగన్ ను ఫాలో అయ్యారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కేసీఆర్ అసెంబ్లీ గైర్హాజరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 15 నెలల్లో కేసీఆర్ శాసనసభ్యుడిగా 57లక్షల 84 వేల124 రూపాయల వేతనం తీసుకున్నారనీ, కానీ అసెంబ్లీకి హాజరైంది మాత్రం కేవలం రెండు రోజులేననీ ఎద్దేవా చేశారు. అయితే ఆ విమర్శలను, ఎగతాళిని కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఎవరేమనుకుంటే నాకేం.. అనర్హత వేటు నుంచి తప్పించుకుంటే చాలు అన్నట్లుగా ఆయన వైఖరి కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఫాలో అవుతున్నట్లు తోస్తోంది. అందుకే జగన్ లానే కేసీఆర్ కూడా అసెంబ్లీకి మొక్కుబడిగా ఒక రోజు హాజరై..మళ్లీ ముఖం చూపడం లేదు.
వాస్తవానికి దేశంలో ఉప ఎన్నికలను అత్యంత వ్యూహాత్మకంగా, సమర్ధంగా పార్టీ పురోగతికి, బలోపేతానికి వాడుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్) ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు తెరలేపేవారు. అప్పట్లో ఆయన తనతో సహా పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల ద్వారా ఉద్యమ స్ఫూర్తి ఇసుమంతైనా తగ్గకుండా ఉంచేవారు. అటువంటిట కేసీఆర్ ఇప్పుడు.. ఉప ఎన్నిక అంటే భయపడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేలా వ్యవహరిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కామారెడ్డిలో పరాజయాన్ని చవి చూశారు. గజ్వేల్ లో విజయం సాధించారు. కామారెడ్డి పరాజయంతో ఆయన ఇప్పుడు తనపై అనర్హత వేటు పడి గజ్వేల్ కు ఉప ఎన్నిక వస్తే ఆ స్థానాన్ని నిలుపుకోవడం కష్టం అని భావిస్తున్నారనీ, అందుకే శాసనసభ్యత్వాన్ని కాపాడుకుని, ఉప ఎన్నిక ముప్పును నివారించడానికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున హాజరయ్యారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.