శ్రీవారి సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు  స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు, మంత్రి, నారా లోకేష్, కోడలు నారా బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజుకు చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా మారింది.

అందులో భాగంగానే చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా గురువారం రాత్రికే తిరుమల చేరుకున్నారు.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తదితరులు చంద్రబాబుకు పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద స్వాగతం పలికారు. గురువారం రాత్రి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

చంద్రబాబు కుటుంబ సమేతంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, అర్చ‌కులు  స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయక మండపం వద్ద వేదపండితులు  ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం   కుటుంబ సమేతంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్నారు.   అక్కడ భక్తులకు చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ స్వయంగా  అన్న ప్రసాదాన్ని వడ్డించారు.. దేవాన్ష్ పేరుతో అన్న‌దానం నిర్వ‌హించారు. అనంతరం తిరుమల నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.