రాజమౌళి అభిమాన టెక్నీషియన్ ఎవరు?

 

నిన్న తిరుపతిలో జరిగిన బాహుబలి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా విభిన్నంగా సాగింది. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలలో దర్శక, నిర్మాతలు, నటీనటులు ఒకరినొకరు పొగుడుకోవడానికే సరిపోతుంది. కానీ ఈ కార్యక్రమంలో ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న అనేక మంది టెక్నీషియన్లను పేరుపేరునా గుర్తుంచుకొని కృతజ్ఞత ప్రకటించడం విశేషం. అంతేకాదు ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు వేదిక మీదకి వచ్చిన ప్రతీ ఒక్కరి చేత వారి అభిమాన టెక్నీషియన్ పేరు చెప్పించడం, స్టేజికి వెనుక ఏర్పాటు చేసిన పెద్దతెర మీద అతని ఫోటోని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకొంది. తద్వారా వారిపట్ల నటీనటులకు, ముఖ్యంగా దర్శకుడు రాజమౌళికి ఎంత గౌరవం ఉందో అర్ధమవుతోంది.

 

రాజమౌళిని కూడా ఈ సినిమా కోసం పనిచేసిన వారిలో తన అభిమాన టెక్నీషియన్ పేరు చెప్పమని అడిగినప్పుడు ఆయన కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన కృష్ణ పేరు చెప్పారు. “ఈ సినిమాలో నటీనటులకు, ముఖ్యంగా వీరోచిత సన్నివేశాలలో పాల్గొనే ప్రభాస్, రాణాల కోసం కృష్ణ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, యుద్ద కవచాలు, కిరీటాలు వగైరా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని వేసుకొని వారిరువురూ గంటల గంటలసేపు షూటింగ్ లో పాల్గొనవలసివచ్చేది. అవి పైకి చాలా దృడంగా, బరువుగా కనబడేలా తయారు చేసినా, చాలా తేలికగా ఉండేలా తయారుచేసారు. ఎంతో నైపుణ్యం, శ్రద్ద, ఓర్పు ఉంటే తప్ప అటువంటివి సృష్టించడం సాధ్యం కాదు. అంత గొప్ప కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన కృష్ణకి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని రాజమౌళి అన్నారు.