కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తొలి నుంచీ కాంగ్రెస్ లో ఉండి, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తల పట్ల రేవంత్ చిన్న చూపు చూస్తున్నారన్న ఆగ్రహం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి తొలి నుంచీ పార్టీలో ఉన్న వారి పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాత, కొత్త కాంగ్రెస్ విభేదాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రచ్చకెక్కాయి.

ధర్నాలు, నిరసనల రూపంలో రోడ్డున పడ్డాయి. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో  కడియం శ్రీహరికి వ్యతిరేకంగా స్థానిక నేతలు ధర్నాకు దిగారు. మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్నవారికి కాకుండా  కడియం శ్రీహరి వర్గీయులకే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తున్నారనీ, పెద్దపీట వేస్తున్నారనీ ఆరోపిస్తూ కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ స్థానిక నేత సింగాపురం ఇందిర నాయకత్వం వహించారు. ఇందిర మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలలో కడియం వర్గీయులకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపిస్తూ ఆ కమిటీలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.