రాహుల్ జోడో యాత్ర ముగిసింది.. కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంది?

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ముగిసింది. శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఆయన విజయవంతంగా తన గమ్యం చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు.  అయిదు నెలల కాలంలో 14 రాష్ట్రాలలో కాలి పాదయాత్ర సాగించిన  రాహుల్‌ గాంధీ, ఈ యాత్ర వల్ల పార్టీకి ఎంత మేరకు రాజకీయ లబ్ధి చేకూరిందన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం రావడం లేదు.

రాహుల్ తన పాదయాత్ర ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎర్రటి ఎండలో, వణికించే చలిలో కూడా ఎక్కడా ఆగకుండా ఆయన పాదయాత్ర నిర్ధిష్ట షెడ్యూల్ ప్రకారం సాగింది. ఆయనలోని పట్టుదలను, ఓర్పు, సహనాన్ని ప్రజల కళ్లకు కట్టింది. రాహుల్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. రాజీవ్ గాంధీ తనయుడిగా, తల్లి సోనియా చాటు బిడ్డగానే కాకుండా ప్రజా జీవితంలో యాక్టివ్ గా ఉండే నేతగా, ప్రజల కష్టాలకు, సమస్యలకు స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక అలుపూ, సొలుపు అన్నది లేకుండా రోజుకు 20 కిలోమీటర్లు నడుస్తూ, అదీ ఉత్సాహంగా, ప్రజలతో మమేకమౌతూ ఆయన సాగించిన నడక అందరి దృష్టినీ ఆకర్షించిందనడంలో సందేహం లేదు. స్థిత ప్రజ్ణత సాధించిన నేతగా, పరిణతి చేందిన వ్యక్తిగా, రాజకీయ వేత్తగా ఆయనకు దేశ వ్యాప్త గుర్తింపు తీసుకు వచ్చిందనడంలో సందేహం లేదు.

అయితే ఈ గుర్తింపు  కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ప్రయోజనకరం, ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తుందా? అధికారాన్ని హస్తగతం చేస్తుందా? అంటే మాత్రం అనుమానమే అన్న సమాధానమే రాజకీయ వర్గాల నుంచీ, విశ్లేషకుల నుంచే కాదు.. ఆ పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తోంది. ఆయన పాదయాత్ర సాగుతున్న సమయంలోనే తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైంది. హిమాచల్ లో విజయం సాధించినప్పటికీ.. ఆ విజయాన్ని రాహుల్ పాదయాత్ర క్రెడిట్ లో వేయడానికి వీల్లేదు. ఆ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒక సారి అధికారం మారడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారమే ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీని గద్దె దించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు.  

ఏతావాతా.. రాహుల్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజలలో ఆదరణ ఉందనీ, ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నీరుగారలేదనీ, అయితే ఆ ప్రజాదరణనూ, క్యాడర్ ఉత్సాహాన్నీ ఎన్నికలలో విజయంగా మరల్చుకుందుకు అవసరమైన వ్యూహాలు కరవయ్యాయనీ తేలింది.  ఇక మళ్లీ రాహుల్ వద్దకు వస్తే.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల, ప్రజలకు చేరువ కావడం వల్ల ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్న అవగాహన నిస్సందేహంగా మరింత పెరిగింది.  అలాగే ప్రజలకు కూడా రాహుల్ పట్ల ఇప్పటి వరకూ ఉన్న దృక్ఫథం కూడా మారి ఉంటుంది. నాన్ సీరియస్ రాజకీయ వేత్త కాదనీ, విపక్షాలు ఇంత కాలం విమర్శిస్తున్న విధంగా ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ కాదనీ కూడా అర్ధమైంది. ఆయనలో పరిణితి చెందిన నేతను ఈ యాత్ర  ప్రజలకు పరిచయం చేసింది.  

ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికీ, పార్టీకి అవసరమైన జవసత్వాలు నింపడానికి చేకగలిగిందంతా చేశారు. ఇక మిగిలినది పార్టీ చేయాలి. రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా వ్యక్తమౌతున్న సానుకూలతను వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలదో చూడాలి. పార్టీ పట్ల ప్రజలలో ఆదరణ ఉన్నా,  రాష్ట్రాలలో పార్టీ నేతల మధ్య తగాదాలు, విభేదలూ గెలుపునకు అవరోధాలుగా మారుస్తున్నాయి.

ఈ తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ ఎన్నికల ఓటములకు అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు.. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో విజయంపై పార్టీ దృష్టి సారించాల్సి ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దానిని కాపాడుకోవడం.. విపక్షంగా ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కాంగ్రెస్ ముందున్న సవాళ్లు.  మరీ ముఖ్యంగా  కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో  ఏకకాలంలో బీజేపీ, అధికార బీఆర్ఎస్ లను ఎదుర్కొని విజేతగా నిలవాల్సిన అవసరం ఉంది.